పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళా భద్రత’ అనే అంశంపై పోలీసు శాఖ సదస్సు నిర్వహించింది. డీఐజీ హాజరై మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ఉండటం కాదని.. అంతకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. సమాజంలో తల్లిస్థానం చాలా గొప్పదని.. పురుషుడు ఏ స్థానంలో ఎక్కడ ఉన్నా అందుకు కారణం ఆమె తీర్చిదిద్దడమే అన్నారు.
కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ సమాజంలో మార్పుతోనే రుగ్మతలు రూపుమాపగలమని చెప్పారు. విలువలతో కూడిన విద్య నేర్చుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. మహిళలకు స్వీయ ఆలోచన ఉండాలని.. శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కె.జయలక్ష్మి... చట్టాల గురించి వివరించారు. బాల్య వివాహాలు, ర్యాగింగ్‌పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దార్, బీఆర్‌ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ పి.సుజాత, అదనపు ఎస్పీలు సోమశేఖర్, విఠలేశ్వర్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.