శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న అణు విద్యుత్ కేంద్రం బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని బాధితులు ఆందోళన చేశారు. పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకపోతే అణు విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకుంటామని ఐదు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో హెచ్చరించారు.
ఎవరికి అన్యాయం జరిగినా..
ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా మరో కాకరాపల్లి అవుతుందని బాధితులు హెచ్చరించారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వ యంత్రాంగం బాధితుల్ని చిన్నచూపు చూస్తుందని వాపోయారు. ఇప్పటికైనా పరిహారం చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
పరిహారమేదీ..?
అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి కొన్నాళ్ల క్రితం రైతుల నుంచి భూసేకరణ చేపట్టారని, నివాస స్థలాలను సైతం స్వాధీనం చేసుకున్నారని బాధితులు గుర్తుచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు ఆందోళన వెలిబుచ్చారు. గ్రామాలు ఖాళీ చేసిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు.
స్థలాలు కూడా చూపలేదు..?
కనీసం స్థలాలు కూడా చూపించలేదని బాధితులు అంతర్మథనం చెందుతున్నారు. ఐదు గ్రామాలకు సంబంధించి సుమారు 1979 కుటుంబాలకు నివాసాలు నిర్మించి ఇవ్వాల్సి ఉందన్నారు. ఏడాది నుంచి జిల్లా యంత్రాంగం సహా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. గ్రామాల్లో యువతకి ఉపాధి కల్పిస్తామని హామీఇచ్చి ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. సర్కార్ తక్షణమే స్పందించి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి : నాడు-నేడు పనుల పురోగతి, స్థితిగతులపై జేసీ సమీక్ష