Cyclone Jawad Effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారి దూసుకొస్తోంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్ష నిర్వహించారు.
తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం..
వాయుగుండం.. తుపాను(Cyclone Jawad)గా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో ఉన్న 'జవాద్' తుపాను.. రేపు(శనివారం) ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలి తీవ్రత పెరగనుందని వెల్లడించారు. రానున్న 12 గంటల్లో తుపాను మరింతగా బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఈరోజు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
జవాద్ తుపాను ప్రత్యేకాధికారిగా అరుణ్‌కుమార్
rains in srikakulam: జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ శ్రీకేష్.. జవాద్ తుపాను ప్రత్యేకాధికారిగా అరుణ్‌కుమార్‌ను నియమించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కునేందుకు జిల్లాలో 3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అవసరమైతే హెలికాప్టర్లు తీసుకొస్తామని ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్ తెలిపారు.
జవాద్ తుపాను దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత 12 తీర మండలాల్లో ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు. వంశధార, నాగావళి వరద ప్రభావిత గ్రామాలుగా 237 గుర్తించిన అధికారులు.. జిల్లాలోని 79 పునరావాస కేంద్రాలకు 270 మంది తరలించారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు
- శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08942 240557
- శ్రీకాకుళం డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83339 89270
- పాలకొండ డివిజన్ కంట్రోల్ రూమ్ 08941-260144, 94933 41965
- టెక్కలి డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08945-245188
ఎలాంటి విపత్తులనైనా ఎదుక్కొనేందుకు జిల్లా విపత్తుల నిర్వహణశాఖ, పోలీసు బృందాలు సిద్ధం ఉన్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, గారలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండగా.. మరో బృందం వస్తోంది. మరోపక్క జిల్లాలో తుపాను పరిస్థితి సమీక్ష చేస్తున్న కలెక్టర్ శ్రీకేష్.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు సమీక్షిస్తున్నారు. తీరప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి..
Weather Update: మరింత తీవ్రంగా వాయుగుండం.. రాగల 12 గంటల్లో తుపాను!