Atchenna Fire On Jagan Govt: ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెదేపా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. జగన్ సర్కారు ప్రభుత్వ భూములను కూడా అమ్మేస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందన్న అచ్చెన్న.. జగన్ తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వంగవీటి రాధ తన ఆవేదనను చెబితే.. తెదేపా వాళ్లు రెక్కీ నిర్వహించారని ఓ మంత్రి వ్యాఖ్యానించారని.., వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉండి ఇలా మాట్లాడటమేంటని నిలదీశారు. సినిమా రంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెదేపా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వైకాపా అరాచకానికి తెదేపా కార్యకర్తలు భయపడాల్సిన పరిస్థితి పోయిందని.., ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. తెదేపా కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేసి వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అధికారాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: MINISTER PERNI NANI: నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చు: పేర్ని నాని