TDP leader Narsireddy Sensational Comments on Speaker of AP Legislature: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో ప్రవేశమెలా పొందారంటూ గతకొన్ని రోజుల క్రితం నన్నూరి నర్సింహారెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి చదువుల్లో ఏమైనా మినహాయింపులు ఇచ్చారా..? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తమ్మినేని సీతారాం.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకునే సమయంలో ఏయే పత్రాలను సమర్పించారో చెప్పాలని డిమాండ్ చేసిన నర్సిరెడ్డి.. నేడు తమ్మినేని సీతారాం చదివిన డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ వంటివి పూర్తిగా నకిలీవని మీడియా ముందు ఆధారాలను చూయించారు. అనంతరం ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర దర్యాప్తును జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నన్నూరి నర్సిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..''తమ్మినేని సీతారాం.. ఉస్మానియా విశ్వవిద్యాలయం 'లా' కాలేజీలో జాయిన్ కావడానికి, మహత్మాగాంధీ 'లా' కాలేజీలో జాయిన్ కావడానికి ఏమాత్రం పొంతన లేదు. జాయిన్ అయ్యే సమయంలో ఆయన ఏయే సర్టిఫికెట్లను సమర్పించారు అనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా విచారించటం జరిగింది. విచారణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఆయన.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 'లా' కాలేజీలో 2015-2016లో బీకాం మొదటి సంవత్సరం, 2016-17లో రెండవ సంవత్సరం, 2017-18లో మూడవ సంవత్సరం బీకాం చదివారని అధికారులు వివరాలను అందజేశారు. ఆ తర్వాత అదే నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్‌లో వేరిఫై చేస్తే ఈ సర్టిఫికెట్లు ఫేక్ అని తేలింది. 2015-2016లో చదివిన విద్యార్థుల లిస్ట్‌ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆ కాలేజీ వాళ్లు అందజేశారు. ఆ లిస్ట్‌లో దాదాపు 839 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదివారు. కానీ, తమ్మినేని సీతారాం పేరు మాత్రం ఆ లిస్ట్‌లో లేదు. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పిన హాల్ టికెట్ నెంబర్‌ను చెక్ చేయగా.. డి. భగవంత్ రెడ్డి, తండ్రి స్వామిరెడ్డి పేరుతో ఉంది. అంటే డి. భగవంత్ రెడ్డి పేరుతో తమ్మినేని సీతారాంకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది'' అని ఆయన అన్నారు.
అనంతరం తమ్మినేని సీతారాం.. చదివిన డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని నన్నూరి నర్సింహారెడ్డి ప్రశ్నించారు. తమ్మినేని సీతారాం గతంలో తాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివానని చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. సర్టిఫికెట్లను పరిశీలించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అధికారులు.. తమ రికార్డులో ఆ పేరు మ్యాచ్ కావడం లేదని అధికారికంగా ధృవీకరించారని ఆధారాలను చూయించారు. అంతేకాకుండా, సీతారాంకు సంబంధించిన బీకాం డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ వంటివి కూడా పూర్తిగా నకిలీవని నేటితో స్పష్టమైందని నర్సిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి