వైకాపా ప్రభుత్వం నుంచి తెదేపా కార్యకర్తలు, నాయకులను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. జిల్లా నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
పర్యటన సాగిందిలా..
తొలుత టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ చేరుకున్న లోకేశ్.. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈఎస్‌ఐ వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అచ్చెన్నాయుడు భార్య విజయ మాధవి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చిన లోకేశ్... పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ప్రశ్నిస్తే.. జైలుకే..!
'దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యం అమలవుతోంది. వైకాపా పాలనలో దక్షిణాది బిహార్‌లా రాష్ట్రం మారింది. కార్యకర్తలు, నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ప్రశ్నించేవారిని జైలుకు పంపుతున్నారు. మద్యం, ఇసుక, 108లో అవినీతికి పాల్పడుతున్నారు. ఈఎస్‌ఐ విషయంలో అచ్చెన్నాయుడుకు సంబంధం లేకున్నా ఇరికించారు. 151 మంది వైకాపా శాసనసభ్యులను బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిపై కక్ష సాధించేందుకే తప్పుడు కేసులు బనాయించారు. ఈఎస్‌ఐ వ్యవహారంలో అసలు చెల్లింపులే జరగలేదు. అలాంటప్పుడు అవినీతి ఎక్కడిది' - నారా లోకేశ్
అనంతరం లోకేశ్... శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఇంటికి వెళ్లారు. ఇటీవల అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రమంలో.. ఆయన కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు. జగన్ రెడ్డి నాన్నని చూశాం.. ఇప్పుడు జగన్‌ను చూస్తున్నామని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు అక్రమ కేసులు పెట్టుకున్నా.. ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఎవరూ భయపడవద్దని.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి..