TDP MP Rammohan Naidu: వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్దతులు తీసుకువస్తుంది. కొత్త రకమైన జీవోలు అమలుచేసి ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో మేము అమలు చేసిన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలనే విధంగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు వైఎస్సార్సీపీ నాయకులు. రాష్ట్రంలో జరుగుతున్న ఆటంకాల గురించి, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి, పలు అంశాలపై టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న చర్యలపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా ఏపీలో వైఎస్సార్సీపీ పాలన సాగుతోందని జీవో నంబర్ వన్ తీసుకువచ్చి ప్రతిపక్షాల సభలు, రోడ్డుషోలకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గళమెత్తారు. అందులో భాగంగానే నారా లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు కల్పిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ తప్పుడు విధానాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
" టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకువచ్చి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు, పాదయాత్రలను నిషేధించింది. ప్రజా రక్షణ అని కారణాలు చెబుతోంది. చంద్రబాబు, నారా లోకేశ్ యాత్రలకు ఆటంకం కలిగిస్తోంది. జీవో నంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకువచ్చింది. ఇది రాష్ట్ర సమస్య అయినా రాజ్యాంగానికి సంబంధించినది. అందుకే సభలో మాట్లాడొచ్చని భావిస్తున్నా. ఫిబ్రవరి 2న లోకేశ్ పాదయాత్ర ప్రచార వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి యత్నించారు. 3న బంగారుపాళెంలో విద్యుత్ నిలుపుదల చేసి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో తెదేపా నేతలు, కార్యకర్తలు అండగా నిలిచారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం హక్కు హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న చర్యలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను." - రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ
ఇవీ చదవండి