Para Badminton Player Chapara Poorna Rao : ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విధిరాతను కూడా ఎదిరించవచ్చు అని నిరూపించాడు ఓ యువకుడు. రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయి వీల్ చైరుకే పరిమితమయ్యాడు. క్రీడల్లో రాణించాలని మొక్కువోని దీక్షతో సాధన చేశాడు. తద్వారా అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తాచాటి.. పతకాలు, ప్రశంసలు అందుకున్నాడీ యువ క్రీడాకారుడు .. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు చాపరా పూర్ణారావు. ఇంటర్ వరకు ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నాడు. అయితే పై చదువులకు కావలసిన ఆర్థిక స్థోమత లేక..సంపాదించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు ఈ యువకుడు.
Poorna Rao of Srikakulam : అంతా సాఫీగా సాగితే జీవితం ఎలా అవుతుంది. అదే జరిగింది పూర్ణారావు జీవితంలో కూడా. అనుకోని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొంచెం కదలాలి అన్నా మరొకరి సాయం తప్పని సరైన దీనస్థితిని ఎదుర్కొన్నాడు. అండగా ఉండాల్సిన వాళ్లు పట్టించుకోలేదు. దాదాపు రెండు సంవత్సాలు మానసిక క్షోభ అనుభవించానని చెబుతున్నాడు.. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా..! ఎత్తు పల్లాలు రెండు ఉంటాయని ఆత్మవిశ్వాసం, కొత్త ఆశలతో ముందుకు సాగాడు పూర్ణారావు. ఆశ, ఆలోచన.. ఆశయాలకు దారిని చూపిస్తాయి. అలా తన లాంటి వాళ్ల కోసం ఏర్పడిన పునరావాస కేంద్రం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాడు. అక్కడ మనోధైర్యం పెంపొందించుకుని.. క్రీడాలపై ఆసక్తి కనబరిచానని అంటున్నాడు పూర్ణారావు..
International Para Badminton Tournament : తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో క్రీడల్లో రాణించాలనుకున్నాడు పూర్ణారావు. అలా 2020కర్ణాటకలో జరిగిన రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో మొట్టమొదటిగా పాల్గొని సిల్వర్ మెడల్ సంపాదించాడు. ఆ తర్వాత ఇతని ప్రతిభను చూసిన కోచ్ ఆనందకుమార్ మైసూర్ లో రెండు నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. ఫలితంగా లక్నోలో జరిగిన ఐదో నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లాడు.వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని 15 పైగా పతకాలు సాధించాడు పూర్ణారావు. తాజాగా సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీలలో ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొని మిక్డ్స్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రౌన్జ్ మెడల్ సాధించాడు..
Para Badminton: విధిరాతను ఎదిరించి.. పారా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న శ్రీకాకుళం యువతి
Khelo India Tournament : పేద కుటుంబం.. ఊరి చివర చిన్న ఇల్లు.. పైగా తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులు కావడంతో కూలీపనికి శరీరం సహకరించక ఇంటి దగ్గరే చిన్న దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంటి బాధ్యతలు చూసుకోవలసిన పూర్ణారావు కుర్చీకే పరిమితం అవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే కుమారుడి ఆశయం కోసం తల్లిదండ్రులు ఇద్దరూ సహకారం అందిస్తున్నారు.. కదలేని స్థితి నుంచి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించే స్థాయికి ఎదిగిన పూర్ణారావును అందరూ అభినందిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కి కూడా సిద్ధమవుతున్నాడు. అయితే తనకు ఆర్థిక సాయం అందితే పారా ఒలంపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకువస్తానంటున్నాడు..
Para Olympics : ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు పూర్ణారావు. అనుకోని ప్రమాదాల వల్ల మంచానపడితే.. అక్కడితో జీవితం ఆగిపోయిందని నిరాశ చెందకుడదని అంటున్నాడు. అనుకున్న లక్ష్యం కోసం సాధన చేసి కొత్త జీవితాన్ని పున:ప్రారంభించాలని తనలాంటి వారికి సందేశాన్ని ఇస్తున్నాడు ఈ యువ క్రీడాకారుడు.