లాక్ డౌన్ తో పనులు లేక తమ సొంతూరుకు వెళ్లాలని ఓ తల్లీ కూతుళ్లు కాలిబాట పట్టారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం కనుగల వలస గ్రామానికి చెందిన గంగ, ఆమె కుమార్తె కల్పనతో కలసి కొన్నేళ్లుగా విజయవాడలో కూలి చేసుకుంటూ జీవిస్తోంది. కల్పన చదువుకుంటోంది. పనులు లేక రెండు నెలలుగా ఇంటి వద్దనే ఉండటంతో బతుకు భారంగా మారి వారిద్దరూ స్వగ్రామం కనుగలవలస వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
రెండు రోజుల క్రితం కాలినడకన ప్రారంభించారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని ఒడిశా వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎక్కించారు. వారిద్దరిని విశాఖపట్నంలో దింపేశారు. అక్కడ నుంచి మళ్ళీ పోలీసుల సహకారంతో మరో బస్సు ఎక్కారు. వారు వెళ్లాల్సిన గమ్యం దారి తప్పింది. జాతీయ రహదారిపై ఒడిశా వైపు వెళ్తున్న బస్సును గుర్తించిన తల్లీకూతుళ్లు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామంలో ఉన్న సహాయ కేంద్రం వద్ద దిగారు.
వీరిని గమనించిన సహాయ కేంద్రం సిబ్బంది తహసీల్దార్ ప్రవల్లిక ప్రియకు అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె స్పందించి.. సమీపంలోని పునరావాస కేంద్రంలో పునరావాసం కల్పించారు. సోమవారం ఉదయం ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలించారు. దారి ఖర్చులకు కాస్త నగదు కూడా అందించారు.
ఇదీ చదవండి: