శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు కాంతిని విరజిమ్ముతూ... సప్తరథాలపై కొలువుదీరిన ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. భానుడి కిరణాలు తాకి బంగారు ఛాయలో మెరిసిపోయిన సూర్యనారాయణ స్వామిని చూసిన భక్తులు పరవశించిపోయారు. దాదాపు ఏడు నిమిషాల పాటు స్వామి వారిపై సూర్యకిరణాలు పడిన దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.
ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయాధికారులు చర్యలు చేపట్టారు. భానుడు ఉత్తరాయనం, దక్షిణాయనానికి మారే సందర్భంలో కిరణాలు... స్వామివారిని తాకుతాయని ఆలయ ప్రధానార్చకులు శంకరశర్మ తెలిపారు.
ఇదీ చూడండి: PAWAN KALYAN: నేడు రెండు జిల్లాల్లో జనసేన శ్రమదానం..పాల్గొననున్న పవన్‌కల్యాణ్