శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్న తరుణంలోనే.. చిన్నచిన్నగొడవలు ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో కోటబొమ్మాళి మండలం బలరాంపురంలో తెలుగుదేశం సానుభూతిపరుల ఇళ్లపై వైకాపా మద్దతుదారులు దాడి చేసిన ఘటనలో 15 మంది అరెస్టయ్యారు. రేగిడి మండలం కొండవలసలో.. మూడోదశ ఫలితాలు అనంతరం బ్యాలెట్ పెట్టెలను వైకాపా మద్దతుదారులు ఎత్తుకుపోవటం ఉద్రిక్తతకు దారితీసింది. మూడు పెట్టెలను దగ్ధం చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు 34 మందిపై కేసు నమోదుచేశారు.
పొందూరు మండలం కింతలి పంచాయతీ కాజీపేటలో.. ఈ నెల 19న రాళ్లదాడి జరగటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాళ్ల దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో నాలుగోదశ ఫలితాలు వెల్లడైన రోజే పోలీసులు, గ్రామస్థుల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయని ఆరోపణలున్నాయి. పరిస్థితి సద్దుమణిగిందని అందరూ నిద్రలోకి జారుకుంటున్న సమయంలోనే పోలీసు బలగాలు చిల్లపేటరాజాం గ్రామంపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోకి వచ్చి మరీ దాడి చేశారని.. ఆటోలు, బైక్‌లు, కార్లను ధ్వంసం చేశారని విలపించారు. అప్పటి నుంచీ గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడు ఏమౌతుందేమోనని చాలా మంది గ్రామాలను విడిచిపెట్టి పోయారు. గ్రామంలో ఇప్పటికీ పికెటింగ్ కొనసాగుతోంది.
జి.సిగడాం మండలం మెట్టవలసలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర సందేశాలు పంపించారనే ఆరోపణలతో..వైకాపా, తెలుగుదేశం మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి.. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాలూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ ఘటనలో 16 మందిపై కేసు నమోదైంది. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో... ఎన్నికల ఫలితాలపై మహిళల మధ్య మొదలైన గొడవ... ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు, కర్రలతో పరసర్పం దాడి చేసుకోవటంతో 8 మంది గాయపడ్డారు. భారీగా బలగాలను మోహరించిన పోలీసులు..46 మందిని అరెస్టు చేశారు.
ఇప్పటికీ అక్కడక్కడా ఎన్నికల ఫలితాలపై గొడవలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఇలానే కొనసాగితే గ్రామాల్లో శాంతికి విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు..కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనపల్లె..మనశాంతి పేరుతో గొడవలు జరిగే అవకాశమున్న గ్రామాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా