సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా బారువలో గీతకార్మికుల కుటుంబంలో 1909 ఆగస్ట్ 16న జన్మించారు. పేద గౌడ కుటుంబానికి చెందిన గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8వ సంతానం లచ్చన్న. బారువాలో 8వ తరగతి వరకు చదివి.. మందస రాజావారి హైస్కూల్లో 9 వ తరగతిలో చేరారు. దురలవాట్లతో 9వ తరగతి తప్పగా... శ్రీకాకుళం ఉన్నత పాఠశాలలో ఆయన్ని చేర్పించారు. జగన్నాథం పంతులు ఇంటిలో ఉండి చదువుకొని... డ్రిల్ మాస్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణలో జాతీయ భావాల్ని అలవర్చుకున్నారు . గాంధీ పిలుపుతో విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమంలో కి అడుగేశారు గౌతు లచ్చన్న.
1930లో గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి ప్రభావితమైన లచ్చన్న.... బారువా వద్ద సముద్రపు నీరుతో ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఉద్యమాన్ని నడిపారు. ఈ సమయంలోనే లచ్చన్నను అరెస్టు చేసి టెక్కలి, నరసన్నపేట సబ్ జైళ్లల్లో 40 రోజులు ఉంచారు. కోర్టు తీర్పుతో మరో నెల బరంపురం జైల్లో ఉన్నారు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని... తన విలువైన దుస్తులను అగ్నికి ఆహుతి చేశారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను రాజమహేంద్రవరం జైల్లో 5నెలలు ఉంచారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను.. ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి..పట్టిస్తే 10వేలని బహుమతి ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే బంధించి మూడేళ్లు జైల్లో ఉంచి 1945 అక్టోబరులో విడుదల చేసింది. ఆనాటి నుంచే ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైన లచ్చన్న... 1947లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యారు. అంటరానితనం మీదా లచ్చన్న కత్తి ఝుళిపించారు. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేశారు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కల్పించారు.
గౌతు లచ్చన్న ఉద్యమాలు..
లచ్చన్న3 తరాల ఉద్యమాలకు సాక్షీభూతంగా నిలిచారు. వాటిలో ఒకటి జాతీయోద్యమం. రెండోది ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోవాలంటూ చేసిన ఆంధ్ర ప్రత్యేక ఉద్యమం. మూడోది... ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం సాగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు. ఆచార్య గోగినేని రంగాతో.. లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకంగా చెప్పొచ్చు. గాంధీ, నెహ్రూ గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల స్నేహబంధం. రంగా స్థాపించిన రైతు విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకరు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని భావి జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి నడుము బిగించేటట్లు చేసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయారయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసలో జయప్రదం కావడానికి ప్రధానకారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరూ, కార్యదీక్ష దేశమంతటా తెలిసింది.
చట్టసభలకు ఎన్నిక...
లచ్చన్న ప్రజల పక్షపాతి. దూకుడు, పోరాటతత్వమే ఆయన్ను సర్దార్ ను చేసింది. అన్యాయలను ఎండగట్టడం...అక్రమాలను తులనాడటం లచ్చన్న నైజం. అందువలనే ఆయన 35ఏళ్లపాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికవుతూ వచ్చారు. ప్రజల్లో విశేష పలుకుబడి కలిగిన ఆయనకు నాటి సీఎంలు టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి తమ మంత్రివర్గంలో చోటు కల్పించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చట్టాలను ఆయన రూపకల్పన చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా... రైతుల హక్కుల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం, దళితులు, బహుజనుల బాగు కోసం అలుపెరుగని పోరు చేశారు. బ్రిటిష్ పాలకులు, జమిందారులపై సాగించిన ఉద్యమాల్లో ఆయన ప్రదర్శించిన ధైర్యసహసాలకు ఆశ్చర్యం పొందిన ప్రజలు...ఆయన్ను సర్దార్ అని పిలుచుకున్నారు.
సర్దార్ అంటే....
సర్దార్ అంటే సేనాని. మన దేశంలో ఆ పేరు గడిచినది ఇద్దరే. ఒకరు సర్దార్ వల్లభాయి పటేల్. మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19న కన్నుమూశారు.
ఇదీ చదవండి