శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అన్నారు. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందన్న ఎస్‌ఈసీ, 40 ఏళ్ల తన సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదన్నారు. తమ పరిధి, బాధ్యత తెలుసునన్న ఎస్ఈసీ.. స్వీయ నియంత్రణ పాటిస్తానన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదన్నారు. బాధ్యతలు నిర్వహించేందుకే అధికారాలు ఇచ్చారని స్పష్టం చేశారు. తమ విధుల్లో జోక్యం చేసుకున్నారు కనుకే కోర్టుకు వెళ్లామని.. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఏకగ్రీవాలపై తమకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉందని, ఏకగ్రీవాలకు తాము పూర్తిగా వ్యతిరేకం కాదని నిమ్మగడ్డ తెలిపారు.
యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరణ
శ్రీకాకుళం జిల్లాలో గతంలో 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయన్న నిమ్మగడ్డ అన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేస్తేనే సమస్యలు వస్తాయని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే జిల్లాల్లో పర్యటిస్తున్నామని, ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదుల స్వీకరణకే నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లుండి యాప్ ఆవిష్కరిస్తామని, దాని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తమపై కేసు పెట్టారని, తమ సామగ్రి తీసుకెళ్లి, సిబ్బందిని భయపెట్టారన్నారు. బెదిరింపులకు బెదిరితే వ్యవస్థ పలుచన అవుతుందని, మీ సంగతేంటో చూస్తామన్నట్లు వ్యవహరించడం సరికాదని నిమ్మగడ్డ అన్నారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై వైకాపా ఆశలు నీరుగారాయి: చంద్రబాబు