![up stairs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sklm5_0312newsroom_1606992131_235.jpg)
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో పీర్లకొండ యాత్ర దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. ఏటా మార్గశిర మాసం (ప్రస్తుతం ఒడియా వారికి మార్గశిరం) గురువారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ యాత్రలో అత్యద్భుతం పురాతన కట్టడాలు. అక్కడ విగ్రహాలు ఏమీ ఉండవు. వాటిని ముస్లింలు ప్రార్థనా మందిరాలుగా వినియోగిస్తుంటారు. ఆ కట్టడాల వద్ద లక్షల మంది హిందూ భక్తులు, హైందవ సంప్రదాయంలో చేసే పూజలే పీర్లకొండ యాత్రలు. అక్కడ పూజలు చేయించేంది (కొండకు సమర్పించేవారు) ముస్లింలు కావడం విశేషం. ఈ ఏడాది ఆశ్వీయుజమాసం అధిక మాసంగా రావడంతో తెలుగువారికి పీర్లకొండ ఉత్సవాలంటూ ప్రత్యేకంగా లేవు. ఒడియా సంప్రదాయాన్ని పాటించేవారికి కార్తికపౌర్ణమి తరువాత మార్గశిర మాసం రావడంతో 3, 10 తేదీల్లో పీర్లకొండ యాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత తెలుగువారి మార్గశిరం వచ్చినా, అప్పటికే ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కావడంతో ఈసారి పీర్లకొండ యాత్రలు చేయరని పెద్దలు చెబుతున్నారు.
హైందవ సంప్రదాయంలో ముస్లింల పూజలు
కొండపై ఉన్న రెండు కట్టడాలను దర్శించి, మొక్కులు చెల్లించే భక్తులు, అవి నెరవేరిన తరువాత మళ్లీ వచ్చే ఏడాది కొండను దర్శించుకొంటారు. అందరికీ అనువైన మెట్లు 16వ శతాబ్ధంలో నిర్మించారు. గుర్రాలపై కొండ పైకి రాజులు వెళ్లినట్లుగా మెట్లపై గుర్రపుడెక్కల గుర్తులు నేటికీ కనిపిస్తుంటాయి. ఇక్కడ జరిగే పూజావిధానాలు, తంతు అంతా ఆకట్టుకునేలా ఉంటుంది. హిందువులు అటుకులు, అగరుబత్తి, కర్పూరం, కొబ్బరికాయలు, అరటిపండ్లు, ధూపదీప నైవేద్యాలతో తరలిరాగా, వారి నుంచి ఆ పూజా సామగ్రిని అందుకున్న ముస్లింలు తమ పద్ధతిలో కొండకు సమర్పిస్తారు.
అంతా ప్రత్యేకమే..!
కొండకు వచ్చి మొక్కులు తీర్చుకొనే భక్తులు కొందరు బంధుమిత్రసపరివార సమేతంగా మేళతాళాలతో వస్తారు. వారితో పాటు ఓంకారంతో కూడిన పవిత్ర పతాకాలు, కావిళ్లతో నైవేద్యాలు, అఖండ దీపాలను కొండ వద్ద సమర్పిస్తారు. వారు తెచ్చిన సామగ్రిని కొండపీఠం వద్ద ఉంచి, అక్కడి కందకంలో నీటిని తీర్థంలా ఇచ్చి భస్మాన్ని బొట్టుపెట్టుకోమని అందిస్తారు ముస్లింలు. ఈ తంతులో ఎక్కడా మతవిద్వేషాలు కనిపించవు. అన్ని మతాల వారూ ఒక్కటే అనేలా వేడుక సాగడం ఇక్కడి విశేషం.
ఇదీ చదవండి: