Pawan Kalyan made key comments: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద నిర్వహించిన ‘యువశక్తి’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటు చీలకూడదునుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాను చంద్రబాబుతో సీట్ల పంపకం గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదని పవన్ వెల్లడించారు. తాను దశాబ్దంపాటు ఒంటరిగానే పోరాడానని పవన్ కల్యాణ్ తెలిపారు.
తనకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తానని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తాను ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా? అంటు పార్టీ కార్యకర్తలను పవన్ ప్రశ్నించారు. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు కలిగించట్లేదని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. నియంతను కలసికట్టుగా ఎదుర్కోవాలని అందుకోసమే తన గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ఆలోచిస్తానని పవన్ తెలియజేశారు. కుదరకపోతే జనసేన ఒంటరిగానైనా వెళ్తుందని తెలిపారు. వస్తే జనసేన ప్రభుత్వం.. లేదంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుందని పవన్ తెలియజేశారు
చంద్రబాబుతో భేటీపై పవన్ కల్యాణ్: 53 నియోజకవర్గాల్లో వైకాపా సాంకేతికంగానే గెలిచిందని పవన్ ఆరోపించారు. తాను చంద్రబాబును కలిస్తే పిచ్చికూతలు కూస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కొందరు నేతలు బేరాలు కుదిరాయని విమర్శలు చేస్తున్నారని.. పాతిక కోట్లు పన్నులు కట్టే వ్యక్తిని.. నాకు ప్యాకేజీ అక్కర్లేదంటూ అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. తాను చంద్రబాబుతో భేటీ అయితే, రెండున్నర గంటలు ఏం మాట్లాడారని వైసీపీ నేతలు అడుగుతున్నారు.
తొలి 10 నిమిషాలు కుశల ప్రశ్నలు వేసుకున్నామన్న పవన్.. తర్వాత 20 నిమిషాలు అంబటి అసమర్థత గురించి మాట్లాడినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పనికిరాని ఐటీ మంత్రి గురించి 10 నిమిషాలు మాట్లాడామని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల సమస్య గురించి 38 నిమిషాలు మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఎన్నో కులాలు ఉన్నాయి.. అన్నీ సమానమే అన్న పవన్.. రాజకీయాలన్నీ 3 కులాల చుట్టే ఎందుకు తిరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని వెల్లడించారు.