శ్రీకాకుళం జిల్లా టెక్కలి క్రీడాకారులకు పుట్టినిల్లు. ఎన్నో ఆశల మధ్య జనవరి ఒకటో తేదీన టెక్కలి డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని పూర్తి స్థాయి హంగులతో సిద్ధం చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఈ మైదాన దీర్ఘకాలిక లక్ష్యానికి తూట్లు పోడుస్తోంది. భవనాల నిర్మాణం కోసం ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు.. క్రీడాకారుల సాధన, సౌలభ్యాలకు ఇవ్వలేదు. కనీసం విద్యుత్తు సౌకర్యం సమకూర్చని కారణంగా.. క్రీడా ప్రాంగణం ప్రారంభించినా నెలల తరబడి వృథాగా పడి ఉంది. పచ్చికబయళ్లతో పచ్చగా కనిపించాల్సిన మైదానం కంకరతో ఎరుపెక్కింది. క్రికెట్ పిచ్, వాలీబాల్, కబడ్డీ, హ్యండ్ బాల్ పోటీలతో పాటు ఇతర క్రీడలకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యాయామశాల ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. షటిల్ కోర్టు, వ్యాయామశాలలకు అధికారులు తాళాలు వేశారు. చాలామంది ఈ స్థలంలో లారీలు పార్కింగ్ చేస్తున్నారు. అలాగే నాలుగు చక్రాల వాహనాలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మందుబాబులకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అధికారులు ఇప్పటికైనా మైదానం మరమ్మతులు చేపట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
అయితే వీటిపై స్పందించిన జిల్లా క్రీడాసాధికార సంస్థ ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడవు పూర్తికాగానే పనులు ప్రారంభించే విధంగా చొరవ తీసుకుంటామన్నారు.