శ్రీకాకుళం జిల్లాలో 3,868 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 1114 పాఠశాలలను అభివృద్ధి చేయాలని జిల్లా విద్యాశాఖ లక్ష్యం పెట్టుకొంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఏ విధంగా మారతాయో చూపించేందుకు.. జిల్లాలో 2 పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా ఎంపిక చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పొందూరు మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను.. మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, తరగతి గదుల మరమ్మతులు, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, పాఠశాల భవనాలకు రంగులు వేయడం, ప్రహరీ గోడ నిర్మాణం, ఆకుపచ్చ బోర్డుతో పాటు ఇంగ్లీషు ల్యాబ్ ఏర్పాటు చేస్తారు.
ప్రధానోపాధ్యాయులకు నోటీసులు
నాడు-నేడు పనులకు సంబంధించి ప్రతిరోజూ నిధులు ఖర్చు చేయని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో చంద్రకళ సంజాయిషీ తాఖీదులు జారీ చేశారు. ప్రతిరోజూ నిధుల వ్యయాన్ని ఆన్‌లైన్ ద్వారా వివరించాల్సి ఉంది. అయితే గత 3 రోజులుగా నిధులు ఖర్చు చేయని.. జిల్లాలోని 35 మండలాల పరిధిలోని 399 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈవో సంజాయిషీ తాఖీదులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ఇబ్బందిగా మారాయి
కరోనా కాలంలో రోజంతా పాఠశాలలో ఉండి పనులు చేయించడమే కష్టతరంగా మారగా.. ప్రతిరోజూ నిధుల ఖర్చు అంశాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలనే నిబంధనలు ఇబ్బందికరంగా మారాయని వారంటున్నారు. కేవలం కూలీలకు సంబంధించిన ఖర్చులనే చూపాల్సి ఉన్నందున చాలా తక్కువ మొత్తాలుంటాయన్నారు. చాలా పాఠశాలలకు ముడి సరకుల కొరత కారణంగా పనులు చేయలేక, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాల వల్ల బిల్లులు పెట్టట్లేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీరాజ్, ఏపీడబ్ల్యూబీసీ, మున్సిపల్-హెల్త్, సమగ్రశిక్ష, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు పనుల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అయితే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షలో ఇంజినీరింగ్ యంత్రాంగం ఈ పనులు చేపట్టింది.
కూలీలు దొరకడం లేదు
పాఠశాలల అభివృద్ధికి అవసరమైన టైల్స్, గ్రానైట్, విద్యుత్ పరికరాలు, సిమెంటు తదితర సామగ్రిని ఒకేచోట కొనుగోలు చేస్తున్నందున దాని విషయమై ప్రతిరోజూ నిధుల వ్యయం చూపాలంటే ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కరోనా సామాజిక వ్యాప్తి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు దొరకడం చాలా కష్టతరంగా మారిందంటున్నారు. ఒక రోజు పనికి వస్తే 2 రోజులు కూలీలు దొరకట్లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పని చేయించడం ఎంత కష్టమో అధికారులకు తెలియకపోవడం దురదృష్టకరమని అంటున్నారు. రోజంతా పాఠశాలలో ఉండి కూలీల కోసం ఇబ్బందులు పడుతూ పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం మంచిది కాదంటున్నారు.
ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన సంజాయిషీ తాఖీదులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుని వ్యవహరించకపోతే.. ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
'నాడు-నేడు చాలా మంచి కార్యక్రమం. అందులో అనుమానం లేదు. అయితే ఆ పని ఒత్తిడి మాపై పడింది. ఈ కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులకోర్చి మేం పనులు చేయిస్తున్నాం. అయినా కూడా బిల్లులు అప్ లోడ్ చేయలేదనే కారణంతో మాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సాంకేతిక కారణాలు, ఇంకా అనేక కారణాల వల్ల 3 రోజులు బిల్లులు పెట్టడం కుదరలేదు. క్షేత్రస్థాయిలో మా ఇబ్బందుల గురించి ఆలోచించకుండా ఇలా నోటీసులు ఇవ్వడం సరికాదు.' -- ప్రధానోపాధ్యాయులు
ఇవీ చదవండి..