విభజన చట్టం అమలు బాధ్యత కేంద్రానిదే: రామ్మోహన్ నాయుడు - rammohan naidu demands funds of visakha railway zone
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు కేటాయించాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన చట్టం రాష్ట్రాల వ్యవహారం కాదని లోక్‌సభలో స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ వంటి కీలక అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. విభజన అంశాలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనివంటూ లోక్‌సభలో కొందరు వ్యాఖ్యానించడంపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీు.. పార్లమెంట్ చేసిన చట్టంపై పార్లమెంట్లో కాకుండా ఎక్కడ ప్రస్తావించాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు చంద్రబాబు హయాంలోనే భూములు కేటాయించినా ఇప్పటికీ భవనాలు సిద్ధం కాకపోవడంపై కేంద్రాన్ని నిలదీశారు.
ప్రత్యేకహోదా సాధనపై ఏం చేశారు?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఎన్నికల వేళ వైకాపా హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైకాపా మాటాలు నమ్మి 22 మంది ఎంపీలనిచ్చారన్నారు. అయితే ప్రత్యేక హోదా సాధనపై వైకాపా ఎంపీల పోరాటం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రైల్వే జోన్‌కు నిధులేవి?
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనన్న ఎంపీ రామ్మోహన్.. విశాఖ రైల్వే జోన్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు అప్పటి, ప్రస్తుత రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖ పట్నం వచ్చి రైల్వే జోన్ ప్రకటించి, సౌత్‌కోస్టు రైల్వేజోన్ అని పేరు కూడా పెట్టారని చెప్పారు. ఇన్ని రోజులు గడిచనా.. ఆ రైల్వే జోన్‌కు కానీ ఒక్క రూపాయిూ విడుదల కాలేదన్నారు. కచ్చితంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైనా ప్రధాని లేదా కేంద్రం తరపున ప్రతినిధులు ఓ ప్రకటన చేస్తే... దానికి తగిన కేటాయింపులు బడ్జెట్‌లో చేయాలని కోరారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులేవి?
పునర్విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాల నిధుల గురించి ఉందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ నాలుగు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారన్నారు. దేశంలో వెనకబడిన జిల్లాలుగా గుర్తింపు పొందిన జిల్లాలు.. కేంద్రం నిధులు పొందుతున్నాయని, ఏపీలో జిల్లాలకు మాత్రం విడుదల కావట్లేదని చెప్పారు. కేంద్రం ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున 3 సంవత్సరాలకు రూ.1050 కోట్లు విడుదల చేసిందన్న రామ్మోహన్.. ఆ తరువాత ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి విడుదల కాలేదన్నారు. వెనుకబడిన జిల్లాలో ఒకటైన శ్రీకాకుళం నుంచి తాను వచ్చానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున సాధ్యమైనంత వేగంగా ఆ నిధులు విడుదల చేయాలని కోరుతున్నాని అన్నారు.
అద్దె భవనాల్లో విద్య
ఐఐఎం, ఐఐటీ వంటి జాతీయస్థాయి సంస్థలు ఒక్కటీ రాష్ట్రంలో లేవన్న ఎంపీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచనతో కేంద్ర విద్యా సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారని చెప్పారు. తగిన భూములు కేటాయించి రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించామన్నారు. ఆరేళ్లు అయినప్పటికీ అద్దె భవనాలు, సదుపాయాలు లేని భవనాల్లోనే విద్యార్థులు చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేసి వాటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.
దక్షిణాదిన మరో ఉద్యమం
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని తెలిపిన ఎంపీ రామ్మోహన్ నాయుడు... ప్రాజెక్టు నిర్మాణబాధ్యత కేంద్రానిదే అన్నారు. కేంద్రమే పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపిన ఎంపీ.. రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల్లో రూ.5 వేల కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నరేగా నిధులు కేంద్రం విడుదల చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిధులు గుత్తేదారులకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిందని ఎంపీ అన్నారు. కేంద్ర పథకం కాబట్టి కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ 6.6 శాతం నిధులు కోల్పోతోందని, బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందివ్వకుండా... కోతలేంటని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోకపోతే కచ్చితంగా దక్షిణాది నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశముందని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.
ఇదీ చదవండి: