చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, చంద్రబాబు, లోకేశ్‌లకు అచ్చెన్నాయుడు వలే చట్టం వర్తిస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అవినీతికి పాల్పడిన వారెవరైనా అరెస్టు కాక తప్పదన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... లోకేశ్‌పై విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడుతో ప్రారంభమైన అరెస్టులపర్వం కొనసాగుతుందన్నారు. ఫైబర్ గ్రిడ్ వంటి కుంభకోణాల్లో అసలు రంగు బయటపడుతుందని కృష్ణదాస్ అన్నారు.
మా నాయకుడు ఏడాదిన్నర జైలులో ఉన్నా ఎప్పుడు భయపడలేదు... తప్పుచేయని వారు ఎప్పుడూ భయపడరు. అచ్చెన్నాయుడి అరెస్టుతో చంద్రబాబు, లోకేశ్‌కు భయం పట్టుకుంది. ఇసుక స్కాం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే నిరూపించండి. మీకేందుకు భయం. -ధర్మాన కృష్ణదాస్, మంత్రి
వైకాపా కార్యకర్తలు నిరాశ చెందవద్దన్న ఆయన.. స్థానిక ఎన్నికల తర్వాత ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. వైకాపా కార్యకర్తలను గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో అనుసంధానం చేస్తామని మంత్రి కృష్ణదాస్ అన్నారు. కార్యకర్తల సూచనల మేరకే పాలన ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : పిల్లలు పుట్టలేదని భర్త చిత్రహింసలు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య