వేసవి కాలం... కుమ్మరివారికి ఎక్కువ గిరాఖీ అయ్యేది ఈ సమయంలోనే. ఎక్కువ కుండలూ అమ్ముడయ్యేది ఈ కాలంలోనే. ఈ వేసవి కాలం కాస్తా.... కరోనా కాలంగా మారి వారి జీవితాల్లో చీకట్లు తీసుకొచ్చాయి. తాము తయారు చేసుకున్న ప్రమిదలు కుండలు ఇతర పాత్రలు మోసుకుంటూ ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ జీవించడం వారి జీవన విధానం. సంతలో అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక మట్టి పాత్రలు అమ్ముకోలేక ఆదాయం రాక... పాత్రలు తయారు చేసిన అప్పులు తీర్చలేక... కుమ్మరి కుటుంబాలు దీనస్థితిలో ఉంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని భద్ర గ్రామంలో కుమ్మరుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వం అమ్మకాలు జరపడానికి అనుమతులు ఇచ్చినా... ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ కష్టమే అని అంటున్నారు. చేసిన అప్పులు కుప్పలుగా మారాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల