జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం తహసీల్దార్ కార్యాలయంలో జేసీ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. రణస్థలం మండల కేంద్రం మీదుగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రణస్థలం, రావివలస, బావరాజుపాలెం, జె.ఆర్.పురం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది రైతుల నుంచి 66 ఎకరాల భూమిని నాలుగేళ్ల కిందట స్వాధీనం చేసుకున్నారు.
అప్పట్లో ఒక సెంటుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల మధ్యలో పరిహారం ప్రకటించారు. గతంలో ప్రకటించిన పరిహారంతో పాటు నాలుగేళ్లకు సంబంధించిన పరిహారాన్ని సైతం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు తెలిపిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీ వివరించారు. భూములు కోల్పోయిన తమకు పరిహారమైనా ఇవ్వాలని.. లేదంటే భూములను తిరిగి ఇచ్చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పరిహారం చెల్లించకపోతే భూములు స్వాధీనం చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిలకపాలెం నుంచి ఎచ్చెర్ల వరకు రైతులకు ఏ విధంగా పరిహారం చెల్లించారో అదేవిధంగా ఇక్కడ రైతులకు చెల్లించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. పరిహారం చెల్లించకుంటే భూములు తిరిగి అప్పగించాలని అధికారులకు ఆదేశించారు.
ఇవీ చదవండి