Thotwada BC Boys Hostel: వసతి భవనం నిర్మించి అర్ధ శతాబ్దమవ్వడంతో శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడుతూ బాలురుకు నిద్రపోవాలంటేనే భయం పుట్టిస్తోంది. కొత్తది నిర్మించాలని పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఒకప్పుడు దాదాపు రెండు వందల మంది విద్యార్థులతో కళకళలాడే ఈ వసతి గృహం.. నేడు పాతిక మందితో వెలవెలబోతోంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని తోటవాడ మేజర్ పంచాయతీలో బీసీ బాలుర వసతి గృహం నిర్మించి ఇప్పటికి దాదాపు 45 సంవత్సరాలు పైనే అవుతుంది. ఏళ్లుగా వసతి గృహ నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో శిథిలావస్థకు చేరింది. చుట్టుపక్కల గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే గొప్ప సంకల్పంతో.. ఏర్పాటు చేసిన ఈ వసతి గృహంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
వసతి గృహంలో వసతుల లేమితో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వసతి గృహం నిర్వాహణ, మరమ్మతుల విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో భవనం శిథిలావస్థకు చేరింది. స్లాబు పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు వేలాడుతున్నాయి. గోడలు బీటలు వాలి విద్యార్థులకు భయం పుట్టిస్తున్నాయి. గదుల్లో ఇప్పుడు ఏం జరుగుతోందోనని భయంతో.. ఎక్కువగా వరండాలోనే చదువు సాగిస్తున్నామని తెలిపారు. భోజన గదిలో కూడా పైకప్పు పూర్తిగా పాడైపోవడంతో.. ఆహారం తినేటప్పుడు పెచ్చులూడి అన్నంలో పడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే.. వసతి గృహం పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. స్లాబు నుంచి పూర్తిగా నీరు కారుతూ.. పుస్తకాలు, దుస్తులు తడిసిపోతున్నాయని వాపోతున్నారు. గదుల్లో పడుకుంటే ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో.. వరండాలోనే నిద్రపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని బాలురు చెబుతున్నారు. ఒకప్పుడు చుట్టుపక్కల 30కి పైగా గ్రామాలకు చెందిన దాదాపు 2వందల మంది విద్యార్థులు.. ఈ గృహం చదువుకునే వారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో.. నేడు భవనం శిథిలావస్థకు చేరి భయంకరంగా తయారైందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నూతన వసతి గృహంతో పాటు శాశ్వత వార్డెన్‌ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
హాస్టల్ పూర్తిగా పాడైపోయింది.. నేను ఎన్నోసార్లు స్పందనలో ఫిర్యాదు చేసాను.. కలెక్టర్ని కలిసాను.. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. చుట్టు పక్కల గ్రామాల నుంచి నాలుగు వందల మంది పిల్లలు ఉండేవాళ్లు.. తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడ చేర్పించి వలసలు వెళ్లిపోయేవాళ్లు.. అలాంటిది ఈ రోజుకి మూడు, నాలుగు సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ పూర్తిగా పోయింది.- శ్రీనివాస్, స్థానికుడు
ముప్పై గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదివే వారు కాని ఇప్పుడు ఎవరూ చదవడం లేదు. ఎందుకంటే వర్షం వచ్చినప్పడు రూముల్లో నీళ్లు కారుతున్నాయి. అంతే కాదు పెచ్చులు కూడా ఊడి పడుతున్నాయి. ఇప్పుడు మేము ముప్పై మంది మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం వారు మాకు కొత్త హస్టల్ భవనం కట్టి ఇవ్వాలని కోరుతున్నాము.- కార్తిక్, విద్యార్థి
ఇవీ చదవండి: