NO PROPER BRIDGE FOR JILLEDUPETA VILLAGERS : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో జిల్లేడుపేట గ్రామస్థుల వ్యథ వర్ణణాతీతం. 110 గడపల్లో 436 మందికి పైగా జనాభా ఉన్నఈ గ్రామంలో.. తూర్పు, ఉత్తరాన మహేంద్ర తనయ నది, పడమర వంశధార, ఉత్తరాన గుమ్మగడ్డ, దక్షిణాన పొగడవెల్లిగెడ్డ ఉన్నాయి. గ్రామం నుంచి బయటకు అడుగు పెట్టాలంటే నాటు పడవే దిక్కు. దశాబ్దాలుగా నాటు పడవలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతటి కష్టం వచ్చినా వేగంగా ఊరి దాటి బయటకు వెళ్లే దారి లేదు. వంతెన కడితేనే యాతన తీరుతుందని.. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు పంపినా లాభం లేదు. అధికారంలోకి వచ్చిన వారు శంకుస్థాపన రాయి వేయడం తప్ప వంతెన నిర్మాణం జరగలేదు. దీంతో అనారోగ్యం బారినపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్నారు.
వంతెన లేక గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. సరైన ఉపాధి దొరక్క గ్రామస్థులు వలస బాట పడుతున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. బడికే వెళ్లే పిల్లలు, ఉద్యోగులు రోజూ నాటుపడవ ప్రయాణంతో ఇబ్బందిపడుతున్నారు. 108, పౌరసరఫరాలు, అంగన్వాడీ సరుకులు లాంటి సేవలు పొరుగురు వెళ్లి పొందాల్సిన పరిస్థితి. సాయంత్రం 5 గంటలు దాటితే జిల్లేడు పేట వాసులకు బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి.
గర్భిణులు అత్యవసర సమయంలో నాటు పడవలోనే ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. నిత్యావసర సరుకులు రెండు రెట్లు అధికంగా చెల్లించి కొనాల్సిన దుస్థితి .భారీ వర్షాలు పడితే జనం ఊరిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాలి. వర్షాలు వరదల సమయంలో పడవ తీయరు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా..ఎవరూ కనికరం చూపడం లేదని జిల్లేడు పేట మహిళలు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి: