ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేయించారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యాన్‌తో ఢీకొట్టించాడు. శ్రీకాకుళం జిల్లా.. కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామం వద్ద గురువారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని వ్యాన్ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు.
కలహాల కారణంగా...
శ్రీకాకుళం జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన పూతి రాధాకృష్ణ, సారవకోట మండలం అవలంగికి చెందిన లలిత (39)కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లలిత నిమ్మాడ సమీపంలోని చిన్న వెంకటాపురం అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లలిత పిల్లలతో కలిసి కోటబొమ్మాళిలో విడిగా ఉంటోంది. అప్పటి నుంచి భర్త రాధాకృష్ణ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం విధులకు హాజరైన లలిత గ్రామంలో జరిగిన ర్యాలీ, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలస్యం కావడంతో చీకటిలో ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న రాధాకృష్ణ పెద్దబమ్మిడి కూడలి వద్ద వెనుక నుంచి వ్యాన్‌తో ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లలితను స్థానికులు కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడచికిత్స పొందుతూ మృతిచెందింది. ఉదయం నుంచి తమతో పాటు కలిసి విధుల్లో పాల్గొన్న సహోద్యోగి కొద్ది నిమిషాల్లోనే చనిపోయిందేనే వార్త తెలిసి తోటి ఉద్యోగులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై ఎస్సై రవికుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: యువకుడిపై హత్యాయత్నం..పరిస్థితి విషమం