పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ విషయంతో పాటు బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. ఈ వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడాలని పేర్కొంది. విద్యార్థినిలకు శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.టి.జ్యోతి హైకోర్టులో పిల్ వేశారు.
నాడు - నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అందులో భాగంగా న్యాప్కిన్స్ పంపిణీ, మరుగుదొడ్ల ఏర్పాటుతో బడి మానుకునే వారి సంఖ్య తగ్గుతుందని వెల్లడించింది. ఏజీ స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడతానన్నారు. సమగ్ర వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం ఇవ్వాలన్నారు . అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను మార్చి 16 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: మా భూభాగంలో ఏపీ పంచాయతీ ఎన్నికలా..?