లాక్డౌన్ నేపథ్యంలో ఒకే ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళ్లకూడదని చెప్పి, వాహనం నెంబర్ రాసేందుకు ప్రయత్నం చేశాడా కానిస్టేబుల్. అంతే తండ్రీకొడుకులిద్దరూ కానిస్టేబుల్ దగ్గర ఉన్న లాఠీని లాక్కొని తలపై బలంగా కొట్టారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి రైతు బజారు వద్ద జరిగింది.
అసలు ఏం జరిగిందంటే...
లాక్డౌన్ అమలు నేపథ్యంలో కోటబొమ్మాళి రైతు బజారు వద్ద కానిస్టేబుల్ భైరి జీవరత్నం విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో టెక్కలి మండలం, పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులైన వాకాడ శ్రీనివాసరావు, వినీత్ ఒకే ద్విచక్ర వాహనంపై వచ్చారు. దీంతో కానిస్టేబుల్ జీవరత్నం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఒకరే రావాలని చెప్పి, వాహనం నెంబర్ నమోదు చేస్తుండగా తండ్రీకొడుకులిద్దరూ వాగ్వాదానికి దిగారు. జీవరత్నం వద్ద ఉన్న లాఠీని లాక్కొని, తలపై బలంగా కొట్టారు. దీంతో గాయపడిన కానిస్టేబుల్ను కోటబొమ్మాళి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం తండ్రి శ్రీనివాసరావు పరారవ్వగా, వినీత్ పోలీసులకు చిక్కాడు. ద్విచక్రవాహనాన్ని, వినీత్ను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో వాలంటీర్లపై దాడి