గుంటూరులో నిర్బంధ చాకిరీ విషయమై డయల్ 100కు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇళ్లల్లో పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది బాలలకు విముక్తి కల్పించారు. ఇతర జిల్లాల్లోనూ ఇలా పనికి కుదిరిన బాలికలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఏడాది కిందట ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో 37 మంది బాలలను కర్ణాటక తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మంగళూరు హార్బరులో వేటకు వెళ్లే మత్స్యకారులకు పడవల్లో వంట చేసేందుకు వెళ్తున్న వీరిని గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. తరలిస్తున్న వారిపై కేసులు పెట్టారు. అయినా.. మళ్లీ ఆ తంతు యథావిధిగా సాగుతూనే ఉంది.
సిక్కోలు చిన్నారులు వెట్టి చాకిరి వైపు...
దేశంలో ఎక్కడ వలస జీవులకు ఇబ్బంది కలిగిన సంఘటన వెలుగులోకి వచ్చినా అందులో సిక్కోలు వారు ఎక్కువగా ఉంటుంటారు. స్థానికంగా ఉపాధి లేకపోవడం, పేదరికం కారణంగానే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజలది. ఇది కేవలం కుటుంబ పెద్దలకే పరిమితం కాలేదు. బాల్యంపైనా ప్రభావం చూపుతోంది. వెట్టిచాకిరి పేరుతో బాలలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు తల్లిదండ్రులను మచ్చిక చేసుకొని వారి పిల్లలను పక్క జిల్లాలు, రాష్ట్రాల్లో పనులకు కుదుర్చుతున్నారు. తాజాగా జిల్లాకు చెందిన 8 మంది బాలలను ఇలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేస్తూ.. చివరికి బయటపడ్డారు.
గ్రామీణ పేదరికం శ్రీకాకుళం జిల్లాలో చిన్నారులను వెట్టిచాకిరివైపు బలవంతంగా నెట్టివేస్తోంది. తీరప్రాంత మండలాలు, పాలకొండ డివిజన్ పరిధి గ్రామాల నుంచి 12 ఏళ్లు దాటిన బాలికలను ఇతర ప్రాంతాల్లో ఇంటి పనికి కుదుర్చుతున్నారు. కొందరు దళారులు గ్రామాల్లో నిరుపేద వర్గాలను లక్ష్యంగా చేసుకొని డబ్బున్నవారి ఇళ్లల్లో పనికి చేరితే పిల్లల భవిష్యత్తుతో పాటు కుటుంబానికి ప్రయోజనం ఉంటుందని ఆశ చూపుతున్నారు. కనీసం మూడేళ్లకు పనికి కుదుర్చేందుకు కుటుంబానికి రూ.లక్ష వరకు ముందుగానే చెల్లించి నెలవారీగా మరికొంత అందించేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇందుకు గాను దళారీకి రూ.50 వేల వరకు చేరుతుంది. అయితే యజమాని పరంగా పెద్దగా ఇబ్బందులు తలెత్తకపోవడం, కుటుంబ అవసరాలు తీరడంతో తల్లిదండ్రులు ఏమీ అనడం లేదు. కొన్నిచోట్ల సమస్యలు తలెత్తినా ముందస్తు ఒప్పందం నోరుమెదపనీయకుండా చేస్తుంది.
వంట చేసేందుకు తీరప్రాంత బాలలు
మత్స్యకారులకు పడవల్లో వంట చేసేందుకు జిల్లా నుంచి చిన్నారుల అక్రమ రవాణా సాగుతోంది. అక్కడ ఉండే కాలానికి కొంత మొత్తాలకు ఒప్పందం కుదుర్చుకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు బాలలను తీసుకెళుతున్నారు. జిల్లాలోని తీర ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే మత్స్యకారులతో ఎక్కువమంది వెళ్తుంటారు. మూడు, ఆరు నెలలకోసారి ఇంటికి వస్తారు. ఇక్కడ కొంతకాలం ఉండి మళ్లీ వెళ్లిపోతారు.
క్షేత్రస్థాయికి చేరని ప్రయోజనాలు
బాలల హక్కులకు సంబంధించి ప్రభుత్వాలు సమకూర్చుతున్న ప్రయోజనాలు దిగువస్థాయిలో అందని ద్రాక్షలా మారుతున్నాయి. అందరికీ ప్రాథమిక విద్య అందించాలనే విద్యాహక్కు చట్టంతో పాటు చిన్నారుల హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన ఇతర చట్టాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు. ఏ ఆధారం లేనివారికి, మధ్యలో బడి మానేసిన బాలికలకు సంబంధించి రూ.కోట్ల వ్యయంతో కస్తూర్బా బాలికల విద్యాలయాలు, బాలసదనాలు, సంక్షేమ గృహాలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రామీణ పేదరికం బాలల హక్కులను కాలరాస్తోంది. స్థానికంగా ఉపాధికి అవకాశాలు లేనందునే బాలికలతో పాటు బాలురు ఇటువంటి వెట్టిచాకిరీకి తలొంచాల్సి వస్తోంది. ఇప్పటికీ తీరప్రాంతం, గిరిజన గ్రామాల్లో బాలలను బడికి పంపించడం కంటే పనిలో చేర్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఏఏ ప్రాంతాలకు పంపిస్తున్నారంటే: ప్రకాశం, కృష్ణా, గుంటూరు, విశాఖ, హైదరాబాద్
కేసులు నమోదు చేస్తాం
బాలల సంరక్షణకు ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు చేపడుతోంది. అక్రమ రవాణా, బాలలను పనిలో పెట్టేందుకు ప్రోత్సహించడం వంటి అంశాలపై బాలల న్యాయ, కార్మిక చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేస్తున్నాం. పిల్లలను చదివించాలని, పనిలో పెట్టకూడదని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. - జయదేవి, పీడీ ఐసీడీఎస్
బతుకు భారమై..
నాకు ఐదుగురు అమ్మాయిలు. సెంటు భూమి కూడా లేదు. భార్య చనిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నాను. ఆమెకు ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలకు వివాహం చేశాను. మిగిలిన వారిని పోషించి, పెళ్లి చేసే స్థోమత లేదు. పూట గడవని స్థితి. అందువల్లే మా పిల్లలను పనికి పంపించాను. - గుంటూరులో పనికి పంపిన ఓ బాలిక తండ్రి మాట ఇది.
పేదరికం వల్లనే..
మా కుటుంబ పేదరికం వల్లనే పిల్లలను ఇతర ఇళ్లల్లో పనికి పెట్టాల్సి వస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని దుస్థితి . నాకు 50 సెంట్లు భూమి ఉంది. నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఆ భూమిపై జీవనోపాధి సాగడం లేదు. పూట గడవని పరిస్థితి మాది. - మరో బాలిక తండ్రి ఆవేదన ఇది
ఇదీ చదవండి: