2007లో ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. అలా వచ్చిన వాటిలో ప్రస్తుతం నాలుగే మిగిలాయి. 2010లో వీటి తరలింపునకు చేపట్టిన ‘ఆపరేషన్ గజ’లో రెండింటిని తరలించారు. అనంతరం రెండు వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాయి. మరో ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందింది. మరో ఏనుగు విజయనగరం జిల్లాలో మృత్యువాతపడింది.
ఇప్పటివరకు 15 మంది మృతి
ఏనుగుల సంచారం కారణంగా ఏజెన్సీ సమీప గ్రామాల వారికీ ప్రాణహాని కలుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 15 మంది వరకు మృత్యువాత పడ్డారు. 2008 నుంచి 2019 వరకు 200 ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు ఉద్యానవన పంటలు, చెరకు నాశనమయ్యాయి. పాలకొండ అటవీ రేంజ్ పరిధిలోనే 300 ఎకరాల వరకు పంటలకు నష్టం కలిగింది.
ఇక్కడే ఎందుకు..
అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయిన ఏనుగుల గుంపు ఆహారం కోసం మైదాన ప్రాంతాల వైపు వచ్చేశాయి. వీటికి రోజుకు కనీసం మూడువేల లీటర్ల నీరు అవసరం. కొండలపై ఊట గెడ్డలు, చెరువులు అంతరించి పోతున్నాయి. మరో వైపు గిరిజనుల పోడు వ్యవసాయం రోజురోజుకూ విస్తరిస్తోంది. వరి, మొక్కజొన్న, అరటి, పనస, చెరకు వంటివి పండిస్తుండటంతో వీటి కోసం మైదాన ప్రాంతాలకు ఏనుగులు వస్తున్నాయి.
ఉపాధికి దూరం
ఏనుగు బాధిత గ్రామాల ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారు. తరచూ మైదాన ప్రాంతాలకు వస్తుండడంతో ప్రధానంగా గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారు. సుమారుగా 40 వరకు ఏనుగు బాధిత గ్రామాల ప్రజలు ఏనుగులు ఎప్పుడు ఎదురవుతాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఫలించని ప్రతిపాదనలు
* జిల్లాకు చేరిన ఏనుగుల గుంపు నుంచి ప్రజల రక్షణకు అటవీశాఖ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
* ఒడిశా నుంచి వచ్చిన గుంపును తిరిగి వాటి స్థానానికి చేర్చే యత్నంలో భాగంగా ఓ ఏనుగు మృత్యువాత పడడంతో ఒడిశా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. దీంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది.
* రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకూ ప్రతిపాదించారు.
* ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో కందకాలు తవ్వడం ద్వారా సమీప మైదాన ప్రాంతాలకు చేరకుండా ఉండేందుకు చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీన్ని గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో పనులు నిలిచిపోయాయి.
* ఆ తరువాత అటవీశాఖ ఎలిఫేంట్ జోన్‌ను ప్రతిపాదించింది. కొంతమేర అటవీ ప్రాంతాన్ని ఎలిఫేంట్ కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు అప్పటి అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనా కార్యరూపం దాల్చలేదు.
* ఏనుగుల గుంపు పర్యవేక్షణ కష్టతరంగా మారిన నేపథ్యంలో గతంలో రాష్ట్ర ఉన్నతాధికారులు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఏనుగుల శరీరంలో ప్రత్యేకమైన చిప్‌ను అమర్చడం ద్వారా వాటి గమనాన్ని సులభంగా గుర్తించవచ్చన్న ప్రతిపాదనా అమలు కాలేదు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
ఏనుగుల గుంపును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. 15 మంది ట్రాకర్లు నిత్యం ఏనుగుల కదలికలు గమనిస్తూ ఉన్నారు. ఏబీవోలు, ఎఫ్‌బీవోలూ గుంపు కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం.
- సోమశేఖర్, అటవీశాఖ రేంజ్ అధికారి, పాలకొండ
ఇదీ చదవండి :