నిత్యం ఎక్కడో ఓ చోట ఆర్థిక మోసాలు వెలుగుచూస్తున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. అత్యాశకు పోయి నేరగాళ్ల చేతిలో నిలువునా మోసపోతున్నారు. కొవిడ్ సమయంలో యువతను లక్ష్యంగా చేసుకొని.. ఓ వ్యక్తి కోట్లు వసూళ్లు చేసి పరారయ్యాడు. ఆఫ్‌లైన్‌లో వసూళ్లు చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తూ వేలాది మందిని ఆకర్షించేలా చేశాడు. తనకు ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో కోట్లాది రుపాయలు వసూళ్లు చేసి బోర్టు తిప్పేయడంతో.. బాధితులు పోలీస్‌స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఈ ఘటన.. శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
అధిక మొత్తంలో లాభాలు వస్తాయని మాయమాటలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురానికి చెందిన నాగేశ్వరరావు.. నాలుగేళ్లుగా అంబేడ్కర్ వర్సిటీ ఎదురుగా సూర్యా నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్ సేవలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే సామగ్రి విక్రయిస్తూ.. వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో స్థానిక విద్యాసంస్థల్లో చదువుతున్న వారితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారితోనూ పరిచయాలు పెంచుకున్నాడు. తనది ఆన్‌లైన్ వ్యాపారమని.. డబ్బులు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో అసలు కాకుండా అధిక మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పాడు. దీని కోసం తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి యాప్‌ను తయారు చేశాడు. ముందు ప్రజలు, విద్యార్థుల నుంచి వేల రూపాయల పెట్టుబడులను వసూలు చేసి తిరిగి అనుకున్న సమయానికి ఇవ్వడంతో అందరిలో నమ్మకం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా వాసులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల నుంచి లక్షల్లో వసూళ్లు ప్రారంభించి.. అదే విధంగా తిరిగి చెల్లించాడు.
రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరార్..
స్నేహితుల నుంచి విషయం తెలుసుకున్న మరికొంత మంది.. లక్షల్లో పెట్టుబడి పెట్టారు. తమకు తెలిసిన వారి నుంచి పెట్టించారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో.. అదును చూసి నాగేశ్వరరావు బోర్డు తిప్పేశాడు (cheating with online business). రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఊరి విడిచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు.. నాగేశ్వరరావు ఫోన్ నంబర్లకు కాల్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాప్ వచ్చింది. మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడి కోసం అన్వేషణ
నమ్మకంగా తిరిగి చెల్లిస్తుంటే.. తమ బంధువులతో పాటు మరికొందరితో లక్షల్లో పెట్టుబడులు పెట్టించామని.. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎచ్చెర్ల పోలీసులు.. నిందితుడి కోసం అన్వేషణ ప్రారంభించారు.
ఇదీ చదవండి:
Rain Alert to Chittoor and Nellore Districts: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన!