YCP Attack On TDP: సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత జగ్గు అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడిపై బత్తలపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జగ్గు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో.. సీకే పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి పోలీసులు బత్తలపల్లిలో జగ్గును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో జగ్గుకు మద్దతుగా వెళ్లిన కార్యకర్తలపై స్థానిక వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సాంబ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మరో ఇద్దరు గాయపడ్డారు. టీడీపీ నేతల వాహనాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌లు..సీకే పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి కూడా నిరసనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల తీరుపై నేతలు మండిపడ్డారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి, జగ్గును స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టడమేంటని ప్రశ్నించారు. జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, సీఐ, ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని పెనుకొండ డీఎస్పీ హామీ ఇవ్వడంతో.. టీడీపీ శ్రేణులు ఆందోళన విరమించారు.
మాజీ మంత్రి కాల్వను అడ్డుకున్నపోలీసులు: తెలుగుదేశం నేతను పరామర్శించేందుకు సీకేపల్లి వెళ్లుతున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను రాయదుర్గంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాల్వ శ్రీనివాసులు బైఠాయించారు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి జీపులో తరలించే క్రమంలో తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఏకంగా స్టేషన్ పరిసరాల్లోనే వైకాపా నేతలు దాడులు చేస్తుంటే...పోలీసులు ఏం చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తక్షణం పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: