న్యూస్‌టుడే-అమడగూరు: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల పరంపర కొనసాగుతోంది. తొలి రెండు రోజుల్లో పరీక్ష మొదలైన కాసేపటికే తెలుగు, హిందీ పేపర్లు బయటికి రాగా.. మూడో రోజు ఆంగ్ల ప్రశ్నపత్రం కూడా లీకయింది. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన వైకాపా నాయకుల వాట్సప్ గ్రూప్‌లో శుక్రవారం పదోతరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలవగా 9.38 కల్లా వాట్సప్ గ్రూపుల్లోకి చేరింది. దీనిపై మీడియా ద్వారా సమాచారం అందుకున్న డీఈవో విచారణ చేపట్టారు. నల్లచెరువు మండలం ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు సెల్‌ఫోన్ ద్వారా వైకాపా నాయకుల గ్రూప్‌లోకి ప్రశ్నపత్రం వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సీల్డ్‌కవర్ నుంచి తీయగానే ఫొటో
పరీక్ష కేంద్రంలో సీల్డ్‌కవర్ నుంచి ప్రశ్నపత్రాలను బయటకు తీసిన వెంటనే సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి పంపినట్లు వాట్సప్ గ్రూప్‌లో వచ్చిన చిత్రాలను బట్టి అర్థమవుతోంది. దీనిపై శ్రీసత్యసాయి జిల్లా డీఈవో నాగేశ్వరరావును వివరణ కోరగా.. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ద్వారానే వైకాపా గ్రూపుల్లోకి ప్రశ్నపత్రం వెళ్లినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. కేసు నమోదు చేసి, విచారణ జరిపిస్తామన్నారు.
లీకైంది గాండ్లపెంటలో..
ఆంగ్లపరీక్ష ప్రశ్నపత్రం గాండ్లపెంటలో లీకైనట్లు అధికారులు తేల్చారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా విచారణ కొనసాగింది. తొలుత అమడగూరులో లీకైనట్లు ప్రచారం జరిగింది. దీంతో శ్రీసత్యసాయి డీఈవో నాగేశ్వరరావు, ఎంఈవో వేమనారాయణ తదితరులు అమడగూరుకు చేరుకుని విచారించి, అక్కడి పాఠశాలకు సంబంధం లేదని గుర్తించారు. శ్రీనివాసరావు సెల్‌ఫోన్ లొకేషన్ గాండ్లపెంటలో చూపడంతో అక్కడికి చేరుకున్నారు. గాండ్లపెంట జడ్పీ హైస్కూలు, పరిసరాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం చీఫ్ విజయకుమార్, వాటర్‌బాయ్ నరేష్ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుస్టేషన్‌లో సీఐ మధు, ఎస్సై మల్లికార్జునరెడ్డి విచారించారు. లీకు సూత్రధారులు పరీక్ష కేంద్రం చీఫ్, వాటర్‌బాయ్ అని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రశ్నపత్రం వాటర్‌బాయ్ బయటకు తీసుకురాగా, కేంద్రం చీఫ్ సెల్‌ఫోన్‌లో ఫొటోతీసి శ్రీనివాసరావుకు పంపినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనపై డీఈఓ గాండ్లపెంట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
* నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటు శ్రీనివాసరావు, గాండ్లపెంటలో చీఫ్‌గా వ్యవహరిస్తున్న విజయకుమార్ మధ్య పరిచయం ఉంది. వీరిద్దరూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రశ్నపత్రం లీకు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నందికొట్కూరులో లీకేజీ కలకలం: నంద్యాల జిల్లా నందికొట్కూరులో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం శుక్రవారం కలకలం రేపింది. ఆంగ్ల ప్రశ్నపత్రం బయటకు రావడంతో అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. ఉదయం 11 గంటల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రం వైరలైంది. ఇది నందికొట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి బయటికొచ్చిందని తెలుసుకున్న స్థానిక పోలీసులు, తహసీల్దారు ముందుగా అక్కడికి చేరుకున్నారు. అనంతరం కర్నూలు డీఈవో రంగారెడ్డి, తమ సిబ్బందితో వచ్చారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రుతి, ఎస్‌బీ డీఎస్పీ మహేశ్వరరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఒకరి తర్వాత ఒకరు పాఠశాలకు చేరుకున్నారు. మొదట పరీక్షల నిర్వహణ చీఫ్, డిపార్టుమెంటల్ అధికారులను విచారించారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ఫొటోలు ఏ ప్రాంతంలో తీశారన్నది గుర్తించేందుకు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఫొటోలో ప్రశ్నపత్రం పట్టుకున్న వారి చేతిపై ఆషిక అని పెన్నుతో రాసి ఉండటంతో పరీక్ష ముగిశాక ఈ కేంద్రంలో పరీక్షకు హాజరైన 274 మంది విద్యార్థుల చేతులను పరిశీలించారు. అందరినీ పంపేసి, ఇద్దరు విద్యార్థినులను అనుమానంతో అదుపులోకి తీసుకుని 30 నిమిషాల పాటు విచారించారు. అనంతరం బయటికొచ్చిన జిల్లా ఎస్పీ, విద్యాశాఖ అధికారి విలేకర్లతో మాట్లాడుతూ.. ఇది ఇక్కడ జరిగిన సంఘటన కాదని తేల్చిచెప్పారు. దీనిపై పూర్తి విచారణ చేసి, ఎక్కడ జరిగిందో తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో అన్నారు.
* ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాఠశాల వద్ద ఉత్కంఠ నెలకొంది. పరీక్ష సమయం అయిపోయినా విద్యార్థులు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు కేంద్రం వద్దకు చేరుకుని తమ పిల్లలను పంపాలని నినదించారు. ఉదయం సరిగా తినకుండానే పరీక్షకు వచ్చారని, వారిని వెంటనే పంపాలని కేకలు వేశారు. కాసేపటి తర్వాత అధికారులు పిల్లలను పంపించారు.
ఇదీ చదవండి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌కు అడ్డుకట్ట లేదా?