శ్రీలంకలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి అక్కడి ప్రజలను ఆదుకోవాలని పుట్టపర్తి శ్రీ సత్యసాయి సంస్థను ప్రముఖ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ విజ్ఞప్తి చేశారు. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను కలసి శ్రీలంక ప్రజలను ఆదుకోవాలని కోరారు.
శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చిన రణతుంగ.. బుధవారం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజుతో సమావేశమయ్యారు. వారి మధ్య సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి.
ఆర్థిక సంక్షోభంతో.. ఇబ్బందులను ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు సత్యసాయి ట్రస్ట్ సేవలు అవసరం అని ఇక్కడికి రావడం జరిగిందని రణతుంగ తెలిపారు. శ్రీలంకలో ప్రధానంగా మందుల కొరత ఉందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులను సత్యసాయి ట్రస్ట్ సభ్యులకు వివరించడం జరిగిందన్నారు. అందుకు ట్రస్ట్ సానుకులంగా స్పందించినట్లు రణతుంగ తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు: చంద్రబాబు