Tyranny Of YCP Leaders: శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి గ్రామంలో వైసీపీ నాయకుల ఇంటికి దారి కోసం.. తమ స్థలంలో చొరబడేందుకు యత్నించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడ్డుపెట్టుకొని పొక్లెయిన్ సాయంతో బుధవారం ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో దారి వేస్తుండగా.. స్థల యజమానులు అడ్డుకున్నారు. పొక్లెయిన్‌పై కూర్చొని తమ నిరసన తెలిపారు. పోట్లమర్రి గ్రామానికి చెందిన సాకే రుషింగప్పకు ఒకటిన్నర సెంటు స్థలం ఉంది. అందులో రేకులషెడ్లు వేసుకొని ఉండేవారు. ఈ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇటీవల పునాది వేసుకున్నారు. అయితే ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో తమ ఇంటికి దారి ఇవ్వాలని వైసీపీ నాయకులు గొడవ పడుతున్నారని.. నిరాకరించడంతో జగనన్న ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయించారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు.
మేము ఇల్లు కట్టుకోడానికి పునాది వేసుకుంటే..రోడ్డు వేయడానికి స్థలం కావాలని దౌర్జన్యంగా జేసీబీని తీసుకొచ్చి పునాదిని తొలగించాలని చూస్తున్నారు. దీని గురించి న్యాయం జరగాలని ఎమ్మార్వో దగ్గరకు వెళ్లాము, ఎమ్మెల్యే వద్దకు వెళ్లాము, స్పందనలో ఫిర్యాదు ఇచ్చినా స్పందన రాలేదు. మేము ఊళ్లో లేకపోయినా.. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మార్వో, ఆర్ఐ వచ్చి దౌర్జన్యంగా రాళ్లు పాతేసి వెళ్లారు. ఇప్పడు మాకు న్యాయం చేసే వరకు ఊరుకోం.. ఈ జేసీబీ మీద నుంచి లేవము. ఈ దౌర్జన్యానికి కారకులు వైసీపీ నాయకులైన హనుమంత రెడ్డి, ఆదినారాయణ వారి కొడుకులు. -బాధితులు
బాధితులకు అండగా : ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు విషయం తెలియడంతో గ్రామానికి వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచి ఓబులేసు రుషింగప్ప స్థలం ఆక్రమణకు గురికాకుండా బండలు నాటించాడు. ఒక వ్యక్తి కోసం ప్రైవేటు వ్యక్తుల స్థలాన్ని స్వాధీనం చేసుకొని రహదారి వేసేందుకు ప్రయత్నించడం ఏమిటని శ్రీరామ్ ప్రశ్నించారు. పోలీసులు రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులకు మద్దతుగా నిలవడం సరికాదన్నారు. ధర్మారం ఆర్డీవోకు సమస్యను వివరించారు. గ్రామంలో పర్యటించి బాధితులకు న్యాయం చేయాలని ఆర్డీవోను పరిటాల శ్రీరామ్ కోరారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు మా ఎమ్మెల్యే(కేతిరెడ్డి)కి బాగా తెలుస్తుంటాయి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఈ ఫేస్బుక్ ఎమ్మెల్యేకి తెలుస్తుంటాయి.. కానీ ధర్మవరానికి కూతవేటు దూరంలో ఉన్న పోట్లమర్రిలో ఒక్క వ్యక్తి కోసం ఇంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ సమస్య ఎందుకు ఆయనకు తెలియటం లేదో నాకు అర్థం కావటం లేదు. వాళ్ల నాయకులను మందలించి ఎందుకు బుద్ధి చెప్పటం లేదో నాకు అర్థం కావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తిరబడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.- పరిటాల శ్రీరామ్, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్.
ఇవీ చదవండి: