గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు.. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలికపాటి వానకురిస్తేనే వీధులన్నీ బురదగుంటల్లా మారుతున్నాయని.. సర్పంచి, ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరికి వచ్చిన శాసనసభ్యుడి దృష్టికి తీసుకెళ్తుంటే.. అడ్డుతగలడమేంటని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్బందులు పడుతోందని తామని.. మీరు పనులు చేయక, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనీయకపోతే ఏలా అంటూ నిలదీశారు.
జారుకున్న ఎమ్మెల్యే : పరిస్థితి గందరగోళంగా మారటంతో సర్ధి చెప్పాల్సిన ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు. పంటలబీమా విషయంలోనూ సచివాలయ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి.. రైతులకు అన్యాయం చేశారంటూ మహిళా రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులందరికీ బీమా వర్తింపచేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని.. బీమా అందని వారి నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ, సచివాలయ సిబ్బందిని సిద్దారెడ్డి ఆదేశించారు.
పోలీసుల తీరుపై నిరసన : ఎమ్మెల్యే దృష్టికి రహదారి సమస్యను తీసుకెళ్లేందుకు యత్నించిన యువకుడిని పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి రసాభాసాగా మారింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని.. స్థానికులు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు..
ఇదీ చదవండి: