Woman Farmer Protest at Sub Collector Office: నాసిరకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళా రైతు.. ప్రభుత్వం రాయితీతో ఇస్తున్న వేరుశెనగ విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంది. మంగళవారం రైతు భరోసా కేంద్రంలో ఇచ్చిన వేరుశెనగ విత్తనాలను ఇంటికి తీసుకెళ్లి సంచి విప్పి చూడగా నాసిరకంగా ఉన్నాయని, కే-6 రకం ఇచ్చామని అధికారులు చెప్పినా అందులో అధికారులు చెప్పిన విత్తనాలు కాకుండా వేరేవి ఉన్నాయని ఆవేదన చెందింది.
బుధవారం నాడు ప్రభుత్వం అందజేసిన వేరుశెనగ విత్తన కాయలను తీసుకుని వచ్చి పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర కుప్పగా పోసి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ఏడీఏ స్వయంప్రభ, సోమందేపల్లి మండల వ్యవసాయ అధికారి కవిత సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నాసిరకం విత్తనాలు ఉన్న సంచిని తీసుకొని మంచి విత్తనాలు అందజేస్తామని ఆమెకు సర్ది చెప్పారు. తనకు మాత్రమే కాదు.. మండలంలో నాసిరకం విత్తన కాయలు ఇచ్చిన రైతులందరికీ వెనక్కి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది.
మండల వ్యవసాయ అధికారి గురువారం రోజు గ్రామంలోకి వచ్చి విత్తన కాయలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా.. రాతపూర్వకంగా లెటర్ ఇవ్వాలని మహిళా రైతు డిమాండ్ చేసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక రేపు గ్రామంలోకి వచ్చి తనిఖీలు నిర్వహించి అందరికీ న్యాయం చేస్తామని కాగితంపై రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆమె తెచ్చిన విత్తన కాయలను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకుని నాణ్యమైన విత్తనాలను అందజేస్తామని తెలిపారు. దీంతో ఆమె నిరసన విరమించింది.
"నాకు 840 సెంట్ల భూమి ఉంది. వేరుశెనగ పంట వేయడానికి విత్తనాలు కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టా. నిన్న వేరుశెనగ విత్తనాలు వచ్చాయంటే సోమందేపల్లిలో తీసుకున్నాం. ఇంటికి వెళ్లి చూస్తే నాసిరకం విత్తనాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక్కదాన్నే శెనగకాయ తీసుకుని ఇక్కడికి వస్తే.. ఈ సమస్యను ఆర్డీవో మూడు రోజుల్లో పరిష్కరిస్తామని చెబుతున్నారు. నా శెనగకాయ పోయినా ఏం లేదు కానీ అధికారులు మా గ్రామానికి వచ్చి ప్రతి రైతుకు వచ్చిన విత్తనాలను తప్పకుండా చూడాలి. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లాలి. అసలు రేటు ఎంత, సబ్సిడీ ఎంత. రైతుల దగ్గరి నుంచి ఎంతకు కొంటున్నారు అనే వివరాలు మాకు తెలియాలి." -లక్ష్మమ్మ, మహిళా రైతు, కేతిగానిచెరువు