Farmers Demand for compensation their lands : శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ప్రాంతంలో కూలీల వలసలు నివారించేందుకు 2012వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చింది. అప్పట్లో మడకశిర మండలంలోని ఆర్. అనంతపురం, గౌడనహళ్లి, సి. కొడిగేపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో సుమారు 780 మంది రైతులకు చెందిన 2800 ఎకరాల భూములను ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) పేరిట సేకరించారు. 11 సంవత్సరాలైనా నేటికీ పరిశ్రమలు నెలకొల్పక, బాధిత రైతులకు సరైన పరిహారం అందించకపోవడంతో రైతు కుటుంబాలు వలసలతో రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం ఆ భూముల్లో పెద్ద పెద్ద కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది.
2012లో ఆర్.అనంతపురం, గౌడనహళ్లి పంచాయతీల పరిధిలో 480 మంది రైతుల నుంచి 1600 ఎకరాల భూమి సేకరించి స్వాధీనం చేసుకొని ఎకరాకు 2.34 లక్షల పరిహారం అందించారు. 2018లో రెండో విడతగా 3 లక్షలు చొప్పున మరి కొంత మంది రైతులకు పరిహారం అందించారు. సి.కొడిగేపల్లిలో 2009 వ సంవత్సరంలో 300 మంది రైతుల నుంచి 1200 ఎకరాల భూములు సేకరించి మొదటి విడత 18 వేలు, రెండో విడతగ 95 వేల రూపాయలు పరిహారం అందించారు. 11 సంవత్సరాలు అవుతున్న పరిశ్రమలు స్థాపించకపోవడంతో భూముల్లో కంప చెట్లు పెరిగి ప్రదేశమంతా నిర్మానుష్యంగా మారింది. పరిశ్రమల ఏర్పాటు బోర్డులకే పరిమితమయ్యాయి.
కొన్ని సంవత్సరాల క్రితం అధికారులు మా వద్దకు వచ్చి మీ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తూ అరకొర పరిహారం అందించి మా భూములను తీసుకన్నారని రైతులు వాపోతున్నారు. సంవత్సరాలు గడుస్తున్న పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఉద్యోగాలు రాలేదు. పంటలు పండిస్తున్న భూములు కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక బెంగుళూరు నగరంలో వలస వెళ్లి కూలి పని చేసుకుంటున్నామని కొంతమంది రైతులు తెలిపారు.
పక్కనున్న గ్రామాలకు వ్యవసాయ కూలీలుగా వెళుతున్నామని మరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులు వర్షాలు ఏక దాటిన కురిస్తే కూలి పనులు జరగవు. పస్తులు ఉండాల్సి వస్తోంది. మా భూములే మాకు ఉండి ఉంటే లాభాలు రాకున్నా పొట్టకూటి కోసం పొలంలో వ్యవసాయం చేస్తూ జీవించే వాళ్ళమని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూములు కోల్పోయిన తమకు తిరిగి మా భూములు మాకు స్వాధీనం చేయాలి లేదా పరిహారం శాతం పెంచి ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్థానిక ఎమ్మార్వో మాట్లాడుతూ అప్పట్లో భూముల విలువలను బట్టి పరిహారం చెల్లించడం జరిగింది. 90 శాతం మంది రైతులకు పరిహారం అందిందని, త్వరలో పరిశ్రమల స్థాపన జరగనుందని, భూములు ఇచ్చిన రైతులకు వాటిపై సమస్యలు, సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మార్వో తెలిపారు.
ఇవీ చదవండి