Farmer Attempt to Suicide : తమ భూములకు తక్కు పరిహారం ఇస్తున్నారంటూ సత్యసాయి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. బెంగుళూరు నుంచి విజయవాడకు ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి కోసం తమ భూములను కోల్పొతున్నామని.. వాటికి తక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నారని రైతు ఆత్మహత్యకు యత్నించాడు. మార్కెట్ ధరకన్నా తమకు తక్కువ చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఏర్పాటు చేయనున్నారు. ఈ రహదారి శ్రీ సత్యసాయి జిల్లా గుండా వెళ్తొంది. దీని ఏర్పాటుకు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లిలోని భూ సర్వే నిర్వహించటానికి.. ధర్మవరం ఆర్డీవో తిప్పే నాయక్, సర్వే అధికారులు వెళ్లారు. వీరిని కొండగట్టుపల్లిలోని రైతులు అడ్డుకున్నారు. భూ నిర్వాసితులకు ఎకరానికి 2లక్షల 40వేల రూపాయల పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఎకరానికి 10లక్షల పైన పలుకుతోందని.. తక్కువ పరిహారం అందించటమేంటని రైతులు అధికారులను ప్రశ్నించారు. తక్కువ పరిహారం ఇస్తే సర్వే నిర్వహించేదే లేదని.. సర్వేను రైతులు అడ్డుకున్నారు.
అధికారులు 2లక్షల పరిహారం ఇస్తామని అనటంతో.. రైతులు ఒప్పుకోలేదు. అక్కడే ఉన్న నరేంద్రబాబు అనే రైతు వెంట తెచ్చుకున్న పురుగుల మందుతో ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేపట్టాడు. గమనించిన తోటి రైతులు, అధికారులు అడ్డుకున్నారు. పరిహారం సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి ఆర్డీవో తీసుకెళ్తానని. రైతులకు ఎకరానికి ఐదు లక్షల వరకు పరిహారం అందేలా చూస్తానని ఆర్డీవో రైతులకు తెలిపారు. రైతులకు నచ్చజెప్పి అధికారులు తిరిగి సర్వేను నిర్వహించారు. అయితే పోలీసు బందోబస్తు మధ్య సర్వేను చేపట్టారు.
ఇవీ చదవండి :