27 Feet Monolithic Anjaneya Statue : దాదాపు రూ. 30 లక్షల నిధులతో నాలుగు నెలల కాలంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక క్వారీలో రాతితో తయారు చేసిన 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహానికి.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో భక్తులు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. హిందూపురం పట్టణం దండు రోడ్డులోని బైలాంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో 27 అడుగుల ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టించాలని ఆలయ కమిటీ సభ్యులు భావించారు. అనుకున్న విధంగానే దాతల సహకారంతో 30 లక్షలు నిధులతో రాతి విగ్రహం తయారు చేయించాలని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఒక క్వారీలో ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేయించారు. కాగా ఈ విగ్రహం రూపుదిద్దుకొనేందుకు శిల్పులు 4 నెలల పాటు కృషి చేశారని నిర్వాహకులు తెలిపారు.
పట్టణంలోని దండు రోడ్డు బైలాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని దాతల సహకారంతో కుప్పం నుండి ప్రత్యేక వాహనంలో హిందూపురం పట్టణానికి తరలించారు. అలాగే ప్రసిద్ధిగాంచిన సుగురు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజల చేశారు. అనంతరం హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్, అంబేద్కర్ సర్కిల్, మేలాపురం సర్కిల్ల మీదుగా బైలాంజనేయ స్వామి ఆలయం వరకు పురవీధుల గుండా దాదాపు 8 గంటల పాటు శోభాయాత్ర సాగించి ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని తరలించారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆంజనేయ స్వామి భక్తులు పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొని.. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పండుగ వాతావరణం నడుమున మేళ తాళాలతో.. వివిధ వేషధారణలతో 27 అడుగుల ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని బైలాంజనేయ స్వామి ఆలయానికి తరలించారు.
ఈ ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బైలాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్ నెలలో ప్రతిష్టించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: