ప్రకాశం జిల్లా పురపోరులో వైకాపా దూసుకెళ్లింది. ఒంగోలు కార్పోరేషన్‌పై అధికార పార్టీ జెండా ఎగిరింది. జిల్లాలోని ఏడు పట్టణాల్లో మొత్తం 50 డివిజన్లు, 148 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఒక డివిజన్, 23 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అద్దంకిలో ఒక వార్డులో నిలిచిపోయాయి. ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 652 మంది అభ్యర్థులు తలపడ్డారు. 2,87,398 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 75.40 శాతం ఓటింగ్ నమోదైంది.
ఒంగోలు నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు గానూ 41 డివిజన్లు వైకాపా గెలుచుకుంది. తెదేపా 6, జనసేన 1, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు.. ఈ ఇద్దరూ వైకాపా రెబల్సే. ఇక్కడ మెయిర్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో గంగాడ సుజాత పేరు ప్రతిపాదన ఉంది.
చీరాల మున్సిపాలిటీలో వైకాపా, వైకాపా రెబల్స్ మధ్యే పోటీ జరిగింది. ఇక్కడున్న 33 వార్డుల్లో వైకాపా 18 వార్డుల్లో, రెబల్స్ 11 వార్డుల్లో గెలుపొందారు. స్వతంత్రులు ముగ్గురు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు మాత్రమే గెలుపొందారు. రెబల్స్ గా ఉన్నవారిలో 9 మంది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి చెందినవారు. ఇక్కడ వైకాపాకు చెందిన వ్యక్తికే ఛైర్మన్ పదవి లభిస్తుంది.
మార్కాపురం మున్సిపాలిటీలో 30 వార్డులకు గానూ వైకాపా 25 వార్డులు, తెలుగుదేశం 5 వార్డులు గెలుపొందాయి. అద్దంకి నగరపంచాయతీ విషయానికొస్తే తెలుగుదేశానికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. 20 వార్డుల్లో 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 12 వైకాపాకు, 7 తెలుగుదేశం పార్టీకి దక్కాయి.
గిద్దలూరు నగర పంచాయితీలో 20 వార్డుల్లో ఏడు ఏకగ్రీవం కాగా.. అవన్ని వైకాపావే. ఎన్నికలు జరిగిన 13 వార్డుల్లో వైకాపా 9, తెలుగుదేశం 3, ఇతరులు ఒకరు చోట గెలిచారు. కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులకు గానూ ఏకగ్రీవాలతో కలిసి అన్నీ వైకాపా దక్కించుకుంది. ఇక్కడ ప్రతిపక్షం లేకుండా పోయింది.
చీమకుర్తి నగర పంచాయతీలో 20 వార్డుల్లో రెండు తెలుగుదేశం పార్టికి, మిగిలిన 18 వార్డులూ అధికార పార్టీ ఖాతాలో చేరాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టికి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. భాజపా ఎక్కడా తన ఉనికే కనిపించలేదు.
ఇదీ చదవండి: