Cemetery Is Occupied: ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ మండలంలోని మల్లికార్జుననగర్, బాలిరెడ్డినగర్‌లో 1600 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరిపేందుకు స్థలం లేక గతంలో అవస్థలుపడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళితే.. శ్మశానికి కొంత భూమి ఇచ్చారు. తర్వాత అది ఏపీఐఐసీకి చెందినది కావడంతో పారిశ్రామిక అవసరాలకోసం తీసుకుని.. సర్వే నెంబర్ 105లో ఉన్న నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఐదేళ్ల క్రితం కేటాయించారు. అప్పటి నుంచి ఆ కాలనీవాసులు చనిపోయిన తమవారి అంత్యక్రియలను ఆ స్థలంలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ దాదాపు 150 మృతదేహాలను ఖననం చేశారు. చనిపోయిన వారికి ఏటా అక్కడ నివాళులు అర్పిస్తుంటారు.
ఆ స్థలం జాతీయ రహదారి ఏన్హెచ్-16కు ఆనుకుని ఉండటంతో.. అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది. మార్కెట్ ధర ఎకరాకు కోటికి పైనే ఉంది. దీంతో ఆ భూమిని ఎలాగైనా కొట్టేయాలని చూసిన సింగరాయకొండ చెందిన వైయస్ఆర్సీపీ నేత చాన్ బాషా.. నకిలీ పట్టా సృష్టించారు. ఆ భూమి తమదని ఆరునెలలుగా గిరిజనులను బెదిరిస్తున్నారు. రెండు నెలలక్రితం ఏకంగా సమాధులను తవ్వేసి.. మినుము పంట సాగుచేశారు. గిరిజనులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న బాల్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో ఆ భూమి కబ్జాకు గురైన విషయం వెలుగుచూసింది. కబ్జాదారుడైన వైకాపా నేత చాన్‌బాషా అంత్యక్రియలు అడ్డుకోవటంతో బాధితులు.. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు వైకాపా నేత చాన్ బాషాపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే నిందితున్ని ఇప్పటివరకు ఆయన్ను అరెస్టు చేయకపోవడంతో గ్రామస్థులు తమకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల శ్మశానవాటిక స్థలం.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నట్లు సింగరాయకొండ తహశీల్దార్ ఉషా తెలిపారు. అందులో ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, వైకాపా నేత చాన్ భాషా నకిలీ పట్టా ద్వారా ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేశారని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. గిరిజనుల శ్మశానవాటికను తిరిగి వారికి చెందేలా కృషి చేస్తామని తహశీల్దార్ తెలిపారు.
ఇవీ చదవండి: