Young Man Attempted Suicide at Station Due to Police Harassment: వైసీపీ పాలనలో దళితులంటే పోలీసులకు అలుసుగా మారినట్లుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలను క్షేత్రస్థాయిలో కొందరు చెవికెక్కించుకోవడం లేదు. విచారణ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లకు పిలిపించి పరుష పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. అదేమని అడిగితే విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ఇలా చెయడం వల్ల అనేక మందిని భయాందోళనకు గురిచేస్తోంది. ఏకంగా కొందరి ప్రాణాల మీదకే తెస్తోంది. సంబంధం లేకపోయినప్పటికీ తనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ ఓ యువకుడు తీవ్ర మనస్థాపనకు గురయ్యాడు. పోలీసు స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.
నా చావుకి వారే కారణం - కలచివేస్తున్న దళిత యువకుడు మహేంద్ర వాంగ్మూలం
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసు స్టేషన్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఉదంతం దీనికి నిదర్శనం. యర్రగొండపాలెం పట్టణానికి చెందిన నాగెపోగు మోజేష్(19) అనే ఎస్సీ యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు బ్రిడ్జి పక్కన కొంతమంది యువకులు గొడవ పడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో మోజేష్, సుభాని అనే యువకులు అక్కడే ఉండటంతో వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ పేరుతో తీవ్రంగా కొట్టారు. మోజేష్ తండ్రిని పిలిచి పోలీసులు దూషించడం తర్వాత రోజు కూడా మళ్లీ స్టేషన్‌కు రప్పించి కొట్టడంతో మనస్థాపనకు గురైన మోజేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మోజేష్ని పోలీసులు నేరుగా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. ఎవరి ద్వారానో తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముందుగా యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూడగా అక్కడ యువకుడు లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక చాలాసేపు విలపిస్తూ ఉండిపోయారు. కాసేపటికి ఆసుపత్రికి వచ్చిన త్రిపురాంతకం సీఐ మారుతీకృష్ణ వారితో మాట్లాడారు. మార్కాపురం హాస్పటల్లో ఉన్నాడని అక్కడికి రావాలని చెప్పి వెళ్లిపోయారు.
యువకుడిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశాక మెడికో లీగల్ కేసు నమోదు చేసి సంబంధిత పోలీసు స్టేషన్‌కు పంపించాల్సి ఉంది. అయితే వివాదం తమ పైకి వస్తుందనుకున్న పోలీసులు అలా చేయకుండా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు కుదరదని చెప్పడంతో మోజేష్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి సమయంలో యువకుడిని చికిత్స నిమిత్తం పోలీసులు గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కి తరలించారు.
పామర్రులో ఉద్రిక్తత - బ్యానర్లు తొలగించారని టీడీపీ ఆందోళన - అడ్డుకున్న పోలీసులు
పోలీసుల తీరుకు నిరసనగా మోజేష్ కుటుంబ సభ్యులు, బంధువులు యర్రగొండపాలెం స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం సీఐ పాపారావు, పుల్లలచెరువు ఎస్సై శ్రీహరి అక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన విరమించలేదని యువకుడి బంధుమిత్రులు వారికి తేల్చి చెప్పారు. తమ బిడ్డను చూపించాలని పట్టుబట్టారు. టీడీపీ నేత గూడూరి ఎరిక్షన్‌బాబు మార్కాపురంలో బాధిత యువకుడిని పరామర్శించారు. ఆత్మహత్యాయత్నానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకుని యువకుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని పోలీసులు రాజకీయ నాయకులకు అండగా ఉంటూ తరచూ అమాయకులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.