Woman living in burial grounds: శ్మశానం అంటేనే భయం.. అది రాత్రివేళలో ఆ వైపు కనీసం కన్నెత్తైనా చూడాలంటేనే మనం భయపడతాం కానీ అలాంటి శ్మశాన వాటికలో ఓ మహిళ జీవనం సాగిస్తూ.. శవాలే స్నేహితులుగా.. దహన సంస్కారాలే దినచర్యగా భావించి జీవనం కొనసాగిస్తోంది. శ్మశానానికి కాపలానే తన వృత్తి అనుకుంటూ సమాధుల మధ్యనే ఓ చిన్న పూరిపాకను ఏర్పాటు చేసుకొని జీవిస్తోంది. గత 30 ఏళ్లుగా ఒంటరిగా ఎన్నో దహన సంస్కారాలతోపాటుగా మృతదేహాలకు గోతులు తీయ్యడం.. పూడ్చడం లాంటివి చేస్తూ బతుకీడుస్తోంది ఓ మహిళ.. ఇదేదో సినిమాస్టోరీ అనుకుంటే పొరపాటే.. ప్రకాశం జిల్లా కనిగిరిలోని హిందూ స్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తూ.. శ్మశానంలోనే జీవనం సాగిస్తున్న అచ్చమ్మ మహిళ యధార్థ గాధ.
Wating for govt help: కనిగిరి పట్టణానికి చెందిన అచ్చమ్మకు పెళ్లయిన కొన్నాళ్లకే భర్త మరణించడంతో.. బంధువుల చిన్నచూపు, పేదరికం ఆమెను ఎంతగానో కలిసివేసింది. అయినప్పటికీ ఎక్కడా ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా గుండె నిబ్బరం చేసుకొని మనోధైర్యంతో.. జీవితంలో కృంగిపోకుండా ముందుకు అడుగేసింది. కష్టాలకడిని ఒంటి చేత్తో ఈదగలనని రుజువు చేస్తూ శ్మశాన వాటికకు కాటి కాపరైంది. 30 ఏళ్లుగా ఒంటరిగా జీవనం సాగిస్తూ శ్మశాన వాటికలో ఎన్నో మృతదేహాలకు దహన సంస్కారాలు, ఖననం చేస్తూ సమాధుల మధ్యనే సంచరిస్తూ.. అవసరమైతే మృతదేహాలకు గొయ్యలను తవ్వుతూ.. పూడ్సుతూ.. వారిచ్చే పదోపరకతో పొట్ట పోసుకుంటూ జీవనం సాగిస్తోంది.
30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నా.. సమాధుల మధ్యనే బతుకీడుస్తున్నాను.. ఇక్కడికి వచ్చేవాళ్లు చేసే సాయంతోనే బతుకుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. నాకు ఇల్లు, వాకిలి లేదు. ప్రభుత్వం సాయాలని కోరుకుంటున్నా -అచ్చమ్మ
కరోనాతో ప్రపంచమంతా అల్లోకల్లోలం అవుతున్నప్పటికీ.. అచ్చమ్మ మాత్రం కరోనా పట్ల భయాన్ని వీడి కరోనా సోకి మృతి చెందిన అనేక మృతదేహాలను కూడా ధైర్యంగా ఖననం చేశాననీ.. కానీ కాలం మారిందని వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని.. కనీసం ఉండడానికి గూడు కూడా లేదని.. శ్మశాన వాటికలోని ఓ మూలన సమాధుల మధ్యలో ఉండే పూరిపాకే తన గూడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనను గుర్తించి శ్మశాన వాటికకు కాపలాదారుగా నియమించి తనకు ఓ గూడు ఏర్పాటు చేయాలని అచ్చమ్మ వేడుకుంటోది.
ఇవీ చదవండి: