ప్రకాశంజిల్లా దర్శినియోజకవర్గం దొనకొండ మండలం చందవరం గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు విద్యార్థులు చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లి జారి మృత్యువాత పడ్డారు. ప్రకాశంజిల్లా దొనకొండ మండలంలోని చందవరం గ్రామానికి చెందిన సంగటి సుబ్బారెడ్డి, సీతమ్మల కుమారుడు భార్గవరెడ్డి(15), కురిచేడు మండలానికి చెందిన రమణమ్మ కుమారుడు ఇంద్రారెడ్డి(15) చందవరంలో జరిగే బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ బంధు మిత్రులందరితో కొద్దిసేపు గడిపారు. తరువాత భార్గవరెడ్డి, ఇంద్రారెడ్డి కలసి మోటార్ బైక్పై ఊరికి దగ్గరలో ఉన్న మంచినీరు సరఫరా చేసే చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇద్దరు మంచినీళ్లు తాగుదామని చెరువులోకి దిగారు. చెరువు ఒడ్డు పాచిపట్టి ఉండటంతో కాలు జారి ఇద్దరు చెరువులోపడ్డారు. ఇద్దరికి ఈత రాకపోటంతో నీట మునిగి చనిపోయారు. కుమారుల మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి కడుపుతో ఉన్న భార్యను కిరాతంగా చంపాడు!