ప్రకాశం జిల్లా రైతాంగానికి ప్రధాన పంట పొగాకు. గిట్టుబాటు ధర ఎలా ఉన్నా, ఏటా పంట పండిస్తూనే ఉంటారు. ఈ ఏడాది ప్రారంభంలో అధిక వర్షాలు, పంట అమ్ముకునే సమయానికి లాక్డౌన్ నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయ్యర్లకు అమ్ముకోవలసి వస్తోందని వాపోతున్నారు.
ప్రభావం చూపిన లాక్డౌన్..
ఈ ఏడాది ప్రారంభంలో నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.170 నుంచి రూ.190 వరకు పలకగా... లాక్డౌన్ కారణంగా కొనుగోళ్ళు నిలిచిపోయాయి. దాదాపు 40 రోజుల పాటు సరకు నిల్వ ఉండటం వల్ల పొగాకు బేళ్ళు రంగుమారి, నాణ్యత కోల్పోయాయి. దీనికితోడు అంతర్జాతీయంగా ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో డిమాండ్ తగ్గింది. ఏప్రిల్ 27 నుంచి కొనుగోళ్ళు పున:ప్రారంభం కాగా.. కిలో పొగాకుకు రూ.30 నుంచి రూ.40కి పడిపోయింది.
'ప్రభుత్వమే ఆదుకోవాలి'...
జిల్లాలో ఎస్.బి.ఎస్. ప్రాంతంలో 12,675 బ్యారన్ల పరిధిలో 22,725 హెక్టార్లలో సాగుకు అనుమతి ఇవ్వగా.. 28,214 హెక్టార్లలో పంట సాగయ్యింది. ఎస్.ఎల్.ఎస్ ప్రాంతంలో 11,591 బ్యారన్ల పరిధిలో 27,214 హెక్టార్లకు గాను.. 31,759 హెక్టార్లలో పంట సాగు చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో కొనుగోళ్ళు సాగుతున్నా.. గిట్టుబాటు ధర లేక కర్షకులు నష్టపోతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమను ప్రభుత్వం ఆదుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు.
ఇదీచదవండి.