మిర్చి ధర పడిపోవడం రైతులను కుంగదీస్తోంది. రెండు నెలల క్రితం ఎగిసిన మిర్చి ధరలు పతనమయ్యేసరికి రైతులు కుదేలవుతున్నారు. పండిన పంట మార్కెట్‌కు వచ్చే తరుణంలో దిగజారిన ధరలు మనోవేదనకు గురిచేస్తున్నాయి. నవంబరు, డిసెంబర్ మాసాల్లో కురిసిన వర్షాలు, నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు ఖరీదు తగ్గించేశారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు ప్రారంభించినప్పుడు క్వింటా మిర్చి ధర ఇరవై వేలకు పైగా పలికింది. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా పది నుంచి 15 వేలకు పడిపోయింది.
పెరిగిన పెట్టుబడి ఖర్చు
ప్రకాశం జిల్లాలోని పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, అద్దంకి, ముండ్లమూరు తదితర ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు పెరిగింది. పంట చేతికొచ్చే సమయానికి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కాలంలో ధర మరింత పతనం అవుతోందని... అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు మార్కెట్ ధరల పతనం కంగారు పెడుతుంటే... వాతావరణ మార్పులతో వచ్చిన పంట తెగుళ్లు కర్షకులను మరింత కుంగదీస్తున్నాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగు చేస్తున్న తమకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కర్షకులు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుల పంటలను కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నదాతలు అభ్యర్థిస్తున్నారు.