రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతోపాటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులతో ప్రకాశం జిల్లా రైతులు, ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు జిల్లాకు నీటిని అందకుండా చేయొద్దని కోరారు. ప్రకాశం జిల్లా ప్రజల బతుకులను, అసాధారణమైన కరవు బతుకులను మార్చేసిందని తెలిపారు. ఇక్కడి పంట భూముల్లో సగం భూగర్భ జలాలపై, సగం సాగర్ నీటిపైనా ఆధారపడి ఉన్నాయని భూగర్భ జలాలకు, సాగర్‌కు నీటి ఆధారమైన వర్షాలు రానురానూ తగ్గిపోతుండటంతో సాగు కష్టంగా మారిందని చెప్పారు.
12 ఏళ్ల పాటు కరవు...
గత 15 ఏళ్లలో 12 ఏళ్లపాటు సాధారణ వర్షపాతం లేక కరవు నెలకొందని, 2014-20 మధ్య కేవలం రెండేళ్లు మాత్రమే జిల్లాకు సాగర్ జలాలు ఇచ్చారని గుర్తు చేశారు. మిగిలిన ఐదేళ్లు కేవలం తాగునీటికి మాత్రమే అరకొరగా ఇచ్చారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల నిర్మించాలనే నిర్ణయం ప్రకాశం జిల్లా ప్రజలకు చేటుగా మారిందని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నిండితేనే నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయని నాగార్జునసాగర్ నిండితేనే ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తారని వెల్లడించిన ఎమ్మెల్యేలు.. జలాశయం దగ్గర ఇప్పటికే తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కట్టిందని తెలిపారు. ఈ 3 ప్రాజెక్టులు 14 వేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తాయని కొత్తగా ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 80 వేల క్యూసెక్కులు మళ్లించటానికి సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీశైలంలో 805 అడుగులకు నీటి మట్టం చేరితేనే...
శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం... 885 అడుగులు కాగా... 805 అడుగులకు చేరితేనే రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకునే అవకాశముంటుందని గుర్తుచేశారు. 825 అడుగులకు చేరితే తెలంగాణలోని మూడు ప్రాజెక్టులు నీటిని తోడుకుంటాయని తెలిపారు. ప్రాజెక్టులో నీరు 850 అడుగులకు చేరకమునుపే దాదాపుగా లక్ష క్యూసెక్కులు తోడేస్తుంటే 885 అడుగులకు ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. ఎప్పుడొచ్చిన నీరు అప్పుడే వాడేస్తే నాగార్జునసాగర్‌కు నీళ్లెప్పుడు చేరుతాయని ప్రకాశం జిల్లాకు నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు 40 నుంచి 45 రోజులుగా ఉన్న కృష్ణా వరద ఇప్పుడు 25 రోజులకు పడిపోయిందని... నాగార్జునసాగర్‌లో ఏడాదిలో 330 రోజులు 515 అడుగుల లోపునే నీళ్లు ఉంటాయని... కొత్త ప్రాజెక్టులు వచ్చేస్తే 35 రోజులు సాగర్‌కు నీరు చేరవని తెలిపారు.
జిల్లాలో 11 లక్షల ఎకరాల సాగు
2006 వరకూ 11వేల క్యూసెక్కులు మాత్రమే ఉన్న పోతిరెడ్డిపాడును.. 40 వేల క్యూసెక్కులకు పెంచడం ఇటు తెలంగాణ వైపు ప్రాజెక్టులు కట్టడం వల్ల సాగర్‌కు తక్కువ నీరు వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు 80 వేల క్యూసెక్కులకు పెంచితే సాగర్ మరింత నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 11 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా... ఇప్పటికే ఏళ్ల తరబడి కరవు కారణంగా 4 లక్షల ఎకరాలు భూమి సాగుకి పనికిరాక బీడువారిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల్లో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని తెలిపారు. 36 లక్షల గొంతుకల్లో 15 లక్ష గొంతుకలకు సాగర్ జలాలే ప్రాణాధారమన్నారు.
ఆ వాటా ఎప్పుడిస్తారు?
రాయలసీమ వాటా అయిన 145 టీఎంసీలను తీసుకెళ్తామని... కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు.. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కేటాయించిన 132 టీఎంసీల వాటా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ఇది సాధ్యం కానప్పుడు రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాకు సరైన నీటి వనరు చూపించిన తరువాతనే నిర్మాణం కొనసాగించుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును వేగవంతం చేసి పూర్తిచేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని... చంద్రబాబు హయాంలో ముందుకుసాగిన నాగార్జున కుడికాలువకు గోదావరి జలాల తరలింపు పనులను యుద్ధప్రాతిపదికను పూర్తి చేయాలని కోరారు. గుంటూరు ఛానెల్‌ను దగ్గుబాడు వరకు పొడిగించడం ద్వారా పర్చూరు నియోజకవర్గ దాహార్తిని తీర్చి, పంట భూములకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: