Prakasam District News: కొత్తపట్నం-ఒంగోలు మధ్య సుమారు 25 కిలోమీటర్ల రహదారిలో రెండు ప్రధాన వంతెనల నిర్మాణాలను గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. అందులో ఒక వంతెన నిర్మాణం పూర్తై.. ప్రజలకు అందుబాటులోకి రాగా.. బకింగ్‌హామ్ కెనాల్ మీద చేపట్టిన వంతెన పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. 14కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపట్టిన తర్వాత కెనాల్ ద్వారా జలరవాణా ప్రతిపాదనలు వచ్చాయి. వంతెన డిజైన్‌లో మార్పులతోపాటు అంచనా వ్యయం 18 కోట్లకు పెంచారు. డిజైన్ మార్పుతో పనుల్లో కొంత జాప్యం జరిగినా.. కాంక్రీట్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. వంతెనను రహదారితో అనుసంధానం చేసే పనులను వదిలేశారు.
ఈ వంతెనకు అనుబంధంగా చేపట్టిన మరో చిన్న వంతెన పనులు కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవటం వల్లనే పనులు అర్థాంతరంగా ఆగిపోయాయని విమర్శలు వస్తున్నాయి. వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల పక్కన ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు మీద రాకపోకలు సాగించటం కష్టంగా మారిందని ప్రయాణికులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే కాలువ ప్రవాహానికి రాకపోకలు ఆగిపోతాయన్నారు. ఉన్న మట్టి రోడ్డు కూడా గుంతలు పడి ప్రమాదకరంగా మారిందని వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవతీసుకుని వంతెన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Boat Accident: భావనపాడు వద్ద సముద్రంలో పడవ బోల్తా.. మత్స్యకారులు సురక్షితం