AP Minister Adimualpu Suresh comments: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడి వాహనంపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్ ఈరోజు తమ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడి వాహనంపై దాడి చేసింది తాము కాదని.. ఆ ఘటన విషయంలో కాణిపాకం వినాయకుడి వద్ద తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని అన్నారు.
సహనంతో ఉన్న మాపై రాళ్లు విసిరారు.. మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ''గతంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ.. శుక్రవారం రోజున మేము శాంతియుతంగా నిరసన చేపట్టాము. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడై ఉండి.. రూల్స్‌కి వ్యతిరేకంగా నడి రోడ్డుపై మీటింగ్ ఎలా పెట్టారు..?, కాన్వాయ్ ఆపాల్సిన అవసరం లేకున్నా.. ఇక్కడ కాన్వాయ్‌ని అపి, డోర్ తీసి, నిలబడి చేయి చూపిస్తూ.. మీ సంగతి తెలుస్తాం.. మీ అంతు చూస్తామంటూ కార్యకర్తలను రెచ్చ కొడుతున్న అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మేము నిరసన తెలుపుతున్నామని తెలిసినా.. ఆయన అందరిని చుట్టేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎవరినో బెదిరించాలని, భయపెట్టాలని చూశారు. రాళ్లు రువ్వుతే మేము భయపడతామా..?, రక్తం కరితే వెనక్కి తగ్గుతామనుకున్నారా..?, నిన్న కానీ మేము సహనం కోల్పోతే, పరిస్థితి ఘోరంగా ఉండేది. మేము అందరం సహనంతో ఉంటే రెచ్చిపోయి మాపై రాళ్లు విసిరారు. ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసుల వాళ్ల వైఫల్యం ఉంది.'' అని ఆయన అన్నారు.
అసలు ఏం జరిగిదంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వాహనంపై శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారి వద్దనున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను వెంటనే చంద్రబాబు నాయుడికి అడ్డుగా పెట్టి, రక్షణగా నిలబడ్డారు. దీంతో ఎన్‌ఎస్‌జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు రాళ్లు తగిలి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి సురేశ్, రాాళ్ల దాడి వెనుక చంద్రబాబే ఉన్నాడని ఎదురు దాడికి దిగారు. ఈ ఘటన సమయంలో.. మంత్రి ఆదిమూలపు సురేశ్ ను ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. టీడీపీ నేతలు ఎంత మందితో వస్తారో చూస్తానంటూ ఆవేశంగా నల్ల చొక్కా విప్పి సవాల్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోవడంతో ఆయన వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే అదునుగా కొంతమంది అల్లరి మూకలు చంద్రబాబు వాహనంపై రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై నేడు మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడారు.
ఇవీ చదవండి