ఒకే కుటుంబంలో ఆరుగురు ఎంబీబీఎస్‌లతో ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ తెలుగు లోగిలి వైద్యుల నిలయంగా ప్రశంసలు పొందుతోంది. కూచిపూడిపల్లికి చెందిన దివంగత బీదంశెట్టి పెద్దమల్లయ్య మనుమలైన వారంతా చదువుల్లో నిలకడగా రాణించి వైద్యులుగా భవిష్యత్తు నిర్మించుకుంటున్నారు.
ఆయనకు మొత్తం ఆరుగురు సంతానం కాగా... ఏకైక కుమార్తె ముగ్గురు బిడ్డలూ వైద్య రంగంలోనే ప్రతిభ చాటుతున్నారు. దర్శి పీహెచ్‌సీలో ఒకరు వైద్యురాలిగా పని చేస్తుండగా, మిగిలిన ఇద్దరూ కాకినాడ, నల్గొండలో వైద్య విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కుమారుల సంతానంలోనూ ఒకరు రష్యాలో వైద్య విద్య పూర్తి చేస్తే, మరో ఇద్దరు గన్నవరం, శ్రీకాకుళంలో వైద్యవిద్య అభ్యసిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీదంశెట్టి పెద్దమల్లయ్య తన సంతానాన్ని అనుకున్నంత బాగా చదివించలేకపోయారు. తమ ప్రాంతం ఫ్లోరైడ్, క్యాన్సర్, మూత్రపిండ వ్యాధులకు నెలవుగా మారడం ఆయనను కదిలించింది. తన మనమలు అయినా.. వైద్య విద్య అభ్యసించి పదిమందికీ సేవ చేయాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే వారంతా చదువుల్లో నిలకడగా రాణించి ఎంబీబీఎస్ దిశలో అడుగులు వేశారు. ఉన్న ఊరిలోనే వైద్యశాల ఏర్పాటు చేసి తాతయ్య కోరిక మేరకు ప్రజలకు ఉపయోగపడాలని ఆ వైద్య కుటుంబం ఆశిస్తోంది.
ఇదీ చదవండీ... ప్రభుత్వ సహాయ నిరాకరణ: పతాక స్థాయికి పంచాయతీ పోరు