ఎన్నో కేసులు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు జాగిలం 'షాడో' ఆకస్మికంగా మృతి చెందింది. ప్రకాశం జిల్లా పోలీసుల్లో హీరోస్థాయి ఆదరణ పొందిన ఈ జాగిలం విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచింది. ఉదయం సింగరాయకొండ చోరీ కేసు పరిశోధనకు వెళ్లి.. తిరిగి వస్తుండగా మరణించింది. 4 నెలల క్రితం 6 చోరీ కేసుల ఛేదనలో షాడో క్రియాశీలక పాత్ర పోషించింది.
బంగారు పతకం విజేత
రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీసు జాగిలాలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని కెన్నీ శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది తొమ్మిది నెలలు శిక్షణ ఇచ్చారు. సాధారణ పోలీసు సిబ్బంది మాదిరిగానే పోలీసు జాగిలాలకు సైతం వివిధ అంశాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించారు. డాగ్ హ్యాండ్లర్ సూరగాని మస్తాన్‌రావుతో పాటు షాడో ఇక్కడ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసింది. శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ట్రాకర్, ఎక్స్‌ప్లోజివ్ విభాగాల్లో నమూనా ప్రదర్శనలు నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన పోలీసు జాగిలాలు పాల్గొన్న ఈ ప్రదర్శనల్లో... షాడో ట్రాకర్ విభాగంలో సత్తా చాటింది. అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అప్పటి డీజీపీ ఆర్.పి.ఠాకూర్ చేతుల మీదుగా డాగ్ హ్యాండ్లర్ సూరగాని మస్తాన్‌రావు ఆ పతకాన్ని అందుకున్నారు.
దూకుడే.. ప్రత్యేకత
బెల్జియం మెలినోయిస్ జాతికి చెందిన ఈ జాగిలం శిక్షణ అనంతరం ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో చేరింది. దీనికి షాడోగా పోలీసు ఉన్నతాధికారులు నామకరణం చేశారు. నేర పరిశోధనలో ఈ జాగిలం సేవలు అందించింది. క్లిష్టమైన కేసుల ఛేదనలో షాడో ఉపయుక్తంగా ఉండేదని పోలీసులు చెప్పారు.